లిస్ట్ పెరుగుతోంది చూసుకో జగన్.... ?

Update: 2021-11-19 01:30 GMT
అవును. ఆలస్యం అమృతం విషం అని అనుకుంటున్నారో ఏమో కానీ తామూ రేసులోకి దూసుకువచ్చేస్తున్నారు. కాదేదీ మంత్రి పదవికి అనర్హం అన్న తీరున వరసగా క్యూ కట్టేస్తున్నారు. మంత్రి అయ్యేందుకు తమకు గల అర్హతలను కూడా విడమరచి చెబుతూ జగన్ కి విన్నపాలు చేసుకుంటున్నరు. విజయనగరం జిల్లాలో చూసుకుంటే కాబోయే మంత్రులమంటూ కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఇప్పటికే  ముందు వరసలో ఉన్నారు. ఇపుడు లేటెస్ట్ గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు కూడా రెడీ అయిపోయారు. ఆయన తన ట్రాక్ రికార్డుని సైతం బయటకు తీసి మరీ జగన్ కి తెలియచేస్తున్నారు.

నిజానికి శంబంగి చిన అప్పలనాయుడు  సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆయన కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల తరఫున పలు మార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో చూసుకుంటే బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పనిచేసిన సుజయ క్రిష్ణ రంగారావుని ఓడించారు. సుజయ క్రిష్ణ రంగారావు వైసీపీలో జగన్ తో పాటే కొనసాగిన నేత. ఆయన సడెన్ గా టీడీపీలోకి జంప్ చేసి మంత్రి అయ్యారు. దాంతో ఆయన్ని ఓడించాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన శంబంగికి దక్కింది మాత్రం ప్రభుత్వ విప్ పదవి మాత్రమే. నిజానికి ఆయనకు ఆనాడే సీనియారిటీతో పాటు ఈ బంపర్ విక్టరీని గుర్తు పెట్టుకుని మంత్రిని చేస్తారని అంతా ఆశించారు.

అయితే జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ ఉండడం వల్ల వీలు పడలేదు అంటున్నారు. ఇపుడు బొత్సను కనుక తప్పిస్తే ఆ ప్లేస్ లో తనకు చాన్స్ దక్కుతుందని శంబంగి ఆశపడుతున్నారు. ఇక బొత్స కూడా శంబంగికి ఓటు వేస్తారని అంటున్నారు. ఆయన మనిషిగానే శంబంగి ఈ రోజుకీ ఉన్నారు. దాంతో రేసులో అనూహ్యంగా శంబంగి దూసుకురావడం జిల్లాలోని వైసీపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉంది మరి. మరి శంబంగి బలమైన వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. అయితే ఆయన నిదానం మనిషి. సౌమ్యుడు. ఎంతసేపూ తానూ తన నియోజకవర్గం అంటూ పరిధిలో ఉంటారు. మరి ఎన్నికల ఏడాదిలో దూకుడు చేయాల్సిన చోట శంబంగి ఎంతవరకూ సత్తా చూపుతారు అన్న చర్చ ఉంది. అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న మాట ఎటూ ఉంది. మరి బొత్స కనుక మంత్రి వద్దు అనుకుంటే ఆయన సూచిచిన వారికే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి శంబంగికి దక్కినా తెర వెనక బొత్స చక్రం తిప్పుతారు అని అంటున్నారు. ఈ రేసులో చూస్తే కోలగట్ల ఆశలు మరోసారి నెరవేరే సీన్ లేదని అంటున్నారు అంతా.
Tags:    

Similar News