పసుపుపచ్చ తాబేలు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు

Update: 2020-11-01 09:50 GMT
పశ్చిమబెంగాల్​ రాష్ట్రంలోని బుర్ధ్వాన్ జిల్లాలో ఓ చెరువులో నుంచి పసుపుపచ్చ తాబేలు బయటకు వచ్చింది. సహజరంగుకు భిన్నంగా తాబేలు పసుపుపచ్చగా ఉండటంతో ఈ వింతను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చెరువు వద్దకు వచ్చారు. మొబైల్ ఫోన్లలో తాబేలు ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. పసుపుపచ్చరంగులో తాబేళ్లు కనిపించడం చాలా అరుదని జంతు ప్రేమికులు అంటున్నారు. చెరువు నుంచి బయటకు వచ్చిన ఈ తాబేలుకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ తాబేలు అటవీఅధికారుల సంరక్షణలో ఉన్నది.

ఈ విషయంపై ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ (ఐఎఫ్ఎస్) దేబాషిష్ శర్మ ట్వీట్​ చేశారు. ‘బుర్ధ్వాన్ జిల్లాలో ఓ పసుపుపచ్చ తాబేలును గుర్తించి స్థానికులు సమాచారం అందించారు. ఈ తాబేలు అల్బినో జాతికి చెందినది. షెల్(చిప్ప) తో పాటు తల, ఇతర భాగాలన్ని పసుపు రంగులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ తాబేలు స్వల్పంగా గాయపడింది. దీనికి తగిన చికిత్స అందించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం. దీని వయసు ఏడాదిన్నర ఉండొచ్చు’ అని దేబాషిశ్​ పేర్కొన్నారు. పసుపుపచ్చ తాబేలు బయటపడటం ఇది రెండోసారి. గతంలో ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ ప్రాంతంలో పసుపు రంగు తాబేలు కనిపించింది.
Tags:    

Similar News