మున్సిపల్ ఉద్యోగి 'తుక్కు' ప్లాన్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు

తుక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే.. జైలుకు పోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు.;

Update: 2026-02-15 11:30 GMT

తుక్కే కదా అని తేలిగ్గా తీసుకుంటే.. జైలుకు పోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. వృథాగా వదిలేశారు.. ఎవరు పట్టించుకుంటారు అని లైట్ గా తీసుకుంటే పోలీసులు ఇచ్చే ట్విస్టులతో ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి రావొచ్చని ఈ ఉదంతం వెల్లడిస్తోంది. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగు 104 వాహనాల మాయం కేసు ఆసక్తికర మలుపుతిరిగింది. ఎవరు పట్టించుకుంటారులే.. తుప్పు పట్టిన బళ్లే కదా! అని మున్సిపల్ ఉద్యోగి ఒకరు మాస్టర్ ప్లాన్ వేశాడు. కానీ ఆ 'తుక్కు' లెక్కలు కాస్తా తేడా కొట్టడంతో, మున్సిపల్ ఉద్యోగి కటకటాల వెనక్కి వెళ్లాడు.

రాయచోటి ఏరియా ఆస్ప్రతి ఆవరణ నుంచి నాలుగు 104 వాహనాలు మాయమయ్యాయని ఇటీవల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాస్తవానికి ఈ వాహనాలు చాలా కాలంగా పనిచేయకపోవడంతో వృథాగా వదిలేశారు. అయితే ఇటీవల ఆసుప్రతి ఆవరణలో ట్రామాకేర్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ఏడాది ఆగస్టులోనే ఈ భవనాల నిర్మాణానికి మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ భూమి పూజ చేశారు. పనులు ప్రారంభించేందుకు గాను 104 వాహనాలను అక్కడి నుంచి పక్కకు తరలించాల్సివచ్చిందని చెబుతున్నారు.

వైద్యఆరోగ్యశాఖ అధికారులకు చెప్పినా వాహనాలను తరలించేందుకు ముందుకు రాకపోవడంతో కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మున్సిపల్ పారిశుధ్య విభాగానికి సమాచారం ఇవ్వడంతో వాహనాలను డంపింగ్ యార్డుకు తరలించినట్లు చెబుతున్నారు. అక్కడ కూడా దాదాపు రెండు నెలలు వాహనాలు ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆస్పత్రి నుంచి డంపింగ్ యార్డుకు వాహనాలను తరలించేందుకు అయ్యే ఖర్చులను రాబట్టుకునేందుకు గాను మున్సిపల్ ఉద్యోగి నరసింహులు 104 వాహనాలను తుక్కు కింద విక్రయించినట్లు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై పత్రికల్లో వార్తలు రావడంతో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ చలపతిరావు దర్యాప్తు జరపగా, మున్సిపల్ ఉద్యోగి తుక్కు ప్లాన్ బయటపడిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు ప్రభుత్వ ఆస్తులను దొంగిలించిన నేరం కింద మున్సిపల్ ఉద్యోగి నరసింహులు, అతడికి సహకరించిన మరో ఉద్యోగిపై కేసు నమోదు చేశారు. నరసింహులను అరెస్టు చేయగా, ఉద్యోగి శివప్రసాద్ పరారీలో ఉన్నాడు. ఇక వాహనాలు విక్రయించగా, రూ.1.50 లక్షలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేశారని సీఐ తెలిపారు.

Tags:    

Similar News