మంత్రిగారి ఇలాఖాలో చేతులెత్తేసిన వైసీపీ?

Update: 2021-02-25 02:30 GMT
రాష్ట్రవ్యాప్తంగా ఒక లెక్క.. ఆ మంత్రి ఇలాఖాలో మరో లెక్కలా ఉందట.. అన్ని జిల్లాల్లో వైసీపీ విజయం సాధిస్తే.. ఆ మంత్రి నియోజకవర్గంలో మాత్రం టీడీపీ గెలుపొందడం వైసీపీ శ్రేణులను జీర్ణించుకోనివ్వడం లేదు.పంచాయతీ ఎన్నికల్లో  మంత్రి ఇలాకాలో టీడీపీ ఎక్కువ సీట్లు సాధించడం వైసీపీకి అవమానంగా మారింది. ఇప్పుడు దీనిపైనే వైసీపీ పోస్టుమార్టం నిర్వహిస్తోందట..

అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వైసీపీ జోరులో మంత్రి అయ్యారు గుమ్మనూరు జయరాం. ఆలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన లక్కీగా మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఆ గెలుపును కొనసాగించలేకపోతున్నారు. ఎన్నో విమర్శలు, ఆయన పనితీరుతో వైసీపీకి ఇక్కడ దెబ్బ పడుతోంది.మంత్రి నియోజకవర్గమైన ఆలూరులో టీడీపీ మెజార్టీ స్థానాలు సాధించింది. ఆలూరు మేజర్ పంచాయతీతోపాటు మంత్రి ఎంపిక చేసిన వైసీపీ అభ్యర్థులంతా ఓడిపోయారు. టీడీపీ వర్గీయులే ఆయా చోట్ల గెలిచారు.

మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 108 పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో 11 చోట్ల వైసీపీ అనుచరులు ఏకగ్రీవమయ్యారు. ఎన్నికలు జరిగిన 97 పంచాయతీల్లో 67 వైసీపీ గెలిచింది. టీడీపీ 27 చోట్ల విజయం సాధించింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ వైసీపీ మెజార్టీ స్థానాలు సాధించినా 67 స్థానాల్లో 15 వైసీపీ రెబల్స్ గెలిచినవే. మంత్రికి వ్యతిరేకంగా వారంతా పోటీచేసి గెలిచినవారే. మంత్రి జయరాం నివాసం ఉండే ఆలూరు పంచాయతీని మాత్రం ఆయన గెలిపించుకోలేపోవడం అవమానంగా మారింది. మంత్రి అనుచరులతోపాటు మంత్రిపై ఉన్న వ్యతిరేకత వల్లనే ఆలూచు పంచాయతీని టీడీపీ గెలుచుకుందని ప్రచారం సాగుతోంది.  

ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. మంత్రి తీరు కారణంగానే ఇక్కడ వైసీపీకి ఓటమి ఎదురైందని.. పేకాట రగడ, కర్ణాటక అక్రమ మద్యం వంటివి వైసీపీ ఓటమికి కారణమంటున్నారు. మంత్రికి ఇవి భవిష్యత్తులో ఎసరు తెస్తాయని అంటున్నారు.
Tags:    

Similar News