ఎన్టీఆర్ కి భారత రత్న...బాబు ఏమి చెప్పారంటే !

తెలుగు తేజం, తెలుగు వారి నిలువెత్తు సంతకం. దిగ్గజ నేత అద్భుత కళా కారుడు ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే ఎంతైనా ఉంది.;

Update: 2026-01-18 15:33 GMT

తెలుగు తేజం, తెలుగు వారి నిలువెత్తు సంతకం. దిగ్గజ నేత అద్భుత కళా కారుడు ఇలా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే ఎంతైనా ఉంది. ఆ మహానుభావుడికి భారత రత్న అన్నది ఒక అలంకారం అవుతుంది. అంతే కాదు తెలుగు వారికి అది ఎంతో గర్వకారణం అవుతుంది. ఆయన చేసిన కృషికి ఆ అవార్డు దక్కడం ఎంతో మందికి స్పూర్తి వంతం అవుతుంది. దేశం గర్వించే మహా నేతగా ఎన్టీఆర్ ఉన్నారు అన్నది నిస్సందేహం. ఆయనకు ఈ సమున్నత పౌర పురస్కారం దక్కాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. కానీ ఆ ఆకాంక్ష అలాగే ఉండిపోతోంది. అన్న గారు గతించి మూడు దశాబ్దాల కాలం గడచిపోయింది. కానీ భారత రత్న మాత్రం ఆయనను వరించలేదు, ఇదే తెలుగు వారికి పట్టుకున్న ఒక చింత ఆవేదనగా ఉంది.

ఎక్కడ అవాంతరమో :

ఎన్టీఆర్ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఆయన రాజకీయాల్లో కొనసాగినా అజాత శతృవుగానే మెలిగారు. ఆయన తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించిన జాతీయ భావాలతో కేంద్ర స్థాయిలో కూడా తనదైన రాజకీయం చేశారు. మరో జయ ప్రకాష్ నారాయణ్ మాదిరిగా కేంద్రంలో 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుకు కారణం అయ్యారు. ఆయన రాజకీయం కూడా ఎంతో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆయన పాలన సైతం ఎందరిలో అనుసరణీయమైంది. అలాంటి ఎన్టీఆర్ కి అత్యున్నత పౌర పురస్కారం లభించక పోవడం వెనక కారణాలు ఏమిటి ఎందుకు అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నది ఒక చర్చగా నేటికీ ఉంది.

గడచిన కాలంలో :

ఇక కేంద్రంలో చూస్తే గడచిన కాలంలో 12 ఏళ్ళ పాటు మోడీ పాలన ఉంది. అంతకు ముందు పదేళ్ళ పాటు యూపీఏ పాలన ఉంది. దాని కంటే ముందు ఎన్డీయే వాజ్ పేయి పాల ఆరేళ్ళు ఉంది. ఇలా చూసుకుంటే ఈ అన్ని ప్రభుత్వాలలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అతి ముఖ్య పాత్ర పోషించారు 1998 నుంచి 2004 వరకూ సాగిన వాజ్ పేయి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా ఉంది. ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా ఉన్నారు. అలాగే యూపీయే వన్ టూ ప్రభుత్వాలలో కాంగ్రెస్ ఎంపీగా కేంద్ర మంత్రిగా అన్న గారి కుమార్తె పురంధేశ్వరి ముఖ్య పాత్ర పోషించారు. ఇక 2014 నుంచి చూసినా తిరిగి 2024 లో చూసినా బీజేపీ టీడీపీ కలసి పోటీ చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. మరి ఇంత సానుకూల వాతావరణంలో కూడా భారత రత్న పురస్కారం అన్న గారికి ఎందుకు దక్కలేదు అన్న ప్రశ్నకు జవాబు అయితే ఎవరూ చెప్పలేకపోతున్నారు.

ఒకే ఒక్క అవార్డు :

ఎన్టీఆర్ మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో అందుకున్నది ఒకే ఒక కేంద్ర పురస్కారం. అది 1968లో పద్మశ్రీ మాత్రమే. ఆ తరువాత ఆయనకు పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ ఏవీ అవార్డులుగా దక్కలేదు, దానికి కారణం ఆయన రాజకీయాల్లో ఉండడమే అని చెబుతారు. ఆ సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఎంతో మందికి ఆ ఉన్నత అవార్డులు దక్కాయి, కానీ ఎన్టీఆర్ ప్రతిభకు మాత్రం అవార్డులుగా వాటిని అందించలేకపోయారు. ఇక రాజకీయాల్లో ఎంతో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ 1996లో దివంగతులు అయ్యారు. నాటి నుంచి ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ అయితే ప్రజల నుంచే ఎక్కువగా ఉంది.

సాధించి తీరుతాం :

ఇక ఎన్టీఆర్ ముప్పయ్యవ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ అన్న గారికి భారత రత్న సాధిస్తమని స్పష్టం చేశారు. ఆయన లాంటి రాజకీయ నాయకులు అరుదు అన్నారు ఆయన దేశానికి చెసిన సేవలకు ఆ ఉన్నత పురస్కారం లభించడం అవశ్యం అన్నారు. అందరి మనోభావాలను తాను గుర్తు పెట్టుకుంటాను అన్నారు, అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పారు. తనకు ఆ ఆశ ఉందని కూడా చెప్పారు. మరి ఈసారి అయినా ఆ కోరిక తీరుతుందా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News