తిరుమల శ్రీవారి పేరుతో 'లక్కీ డ్రా' మోసం.. రంగంలోకి కరాటే కల్యాణి!
తిరుమల వేంకటేశ్వర స్వామి పవిత్ర నామాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఒక భారీ లక్కీ డ్రా మోసం వెలుగులోకి వచ్చింది;
తిరుమల వేంకటేశ్వర స్వామి పవిత్ర నామాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఒక భారీ లక్కీ డ్రా మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ. 399 చెల్లిస్తే చాలు.. ఫార్చ్యూనర్ కారు, ఐఫోన్, ఖరీదైన బైక్‌లు గెలుచుకోవచ్చంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడానికి నటి కరాటే కల్యాణి పోలీసులను ఆశ్రయించారు.
అసలేం జరిగింది?
ప్రవీణ్ కాస, సిద్ధమోని మహేందర్ అనే ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తిరుమల ఆలయ ప్రాంగణాన్ని వేదికగా చేసుకుని కొన్ని వీడియోలు చిత్రీకరించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ శ్రీవారి పేరును వాడుకుని ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని కరాటే కల్యాణి ఆరోపించారు.
మోసం సాగుతున్న తీరు
తక్కువ పెట్టుబడితో భారీ ఆశ చూపించి కేవలం రూ. 399కే లక్కీ డ్రా కూపన్ అని ప్రచారం చేశారు. ఫార్చ్యూనర్ కార్లు, ఐఫోన్లు, టీవీలు వస్తాయని ఆశ చూపారు. అత్యంత పవిత్రమైన తిరుమల కొండపై ఈ మోసపూరిత ప్రచార వీడియోలు చిత్రీకరించారు.
పోలీసుల యాక్షన్
కరాటే కల్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నిందితులు ప్రవీణ్ కాస, సిద్ధమోని మహేందర్‌లపై కేసు ఫైల్ చేశారు. ఐటీ చట్టం 2008లోని సెక్షన్ 318(4) , సెక్షన్ 66 కింద కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? అనే కోణంలో విచారణ సాగుతోంది. "భక్తుల సెంటిమెంట్లను వాడుకుని ఇలాంటి మోసాలకు పాల్పడటం క్షమించరాని నేరం. టీటీడీ పరిధిలో ఇలాంటి ప్రచారాలు జరగడం ఆందోళనకరం అని కరాటే కల్యాణి అన్నారు.
ప్రజలకు హెచ్చరిక
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఆఫర్‌ను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరకే విలాసవంతమైన వస్తువులు వస్తాయని చెప్పే లక్కీ డ్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.