ఏపీ ముఖ్య‌మా? ర‌ఘురామ ముఖ్య‌మా? ఏంపీలూ?!

Update: 2021-12-09 05:30 GMT
ప్ర‌స్తుత పార్ల‌మెంటు స‌మావేశాల్లో వైసీపీ ఎంపీలు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. 22 మంది లోక్‌స‌భ స‌భ్యులు మ‌రో 8 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్న వైసీపీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన  ఒక్క హామీని.. ఒక్క రూపాయిని కూడా రాబ‌ట్ట‌లేక పోయారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ``25 మంది ఎంపీల‌ను ఇస్తే.. హోదా తెస్తా!`` అన్న జ‌గ‌న్ మాట మ‌ట్టికొట్టుకుపోయింది. ఇక‌, మిగిలిన హామీలైన .. పోల‌వ‌రం నిధులు.. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యం.. క‌డ‌ప స్టీల్ ప్లాంట్‌కు నిధులు.. విశాఖ‌లో రైల్వే జోన్ వంటివాటినైనా సాధించారా? అంటే.. ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.

ఇప్ప‌టికి రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. ఈ మ‌ధ్య కాలంలో క‌రోనా కాలం తీసేసినా.. ఇప్పుడు జ‌రుగుతున్న స‌భ‌ల్లో అయినా.. ఎంపీలు ఏపీ నాడిని, ఏపీ గ‌ళాన్ని పార్ల‌మెంటు వేదిక‌గా వినిపిస్తారా?  అని ఎదురు చూసిన‌.. ఏపీ ప్ర‌జ‌ల‌కు.. నిరాశ ఎదుర‌వుతోం  ది. అంతేకాదు.. వైసీపీ ఎంపీల వ్యూహాలు.. వారు చేస్తున్న ప్ర‌సంగాలు.. విని.. చూసి.. ప్ర‌జ‌లు నివ్వెర పోతున్నారు. `ఇందుకా మిమ్మ‌ల్ని` ఎన్నుకున్న‌ది.. అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. ఇంతకీ.. వైసీపీ ఎంపీలు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? అంటే.. వారికి పార్ల‌మెంటులో ప్ర‌శ్నించేందుకు.. కేంద్ర మంత్రుల‌ను నిల‌బ‌ట్టి.. స‌మాధానం చెప్పించేందుకు అసలు విష‌య‌మే ఏమీ లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం పార్లమెంటు స‌మావేశాల్లో ప్ర‌శ్నించేందుకు.. వైసీపీ ఎంపీలు చాలా అంశాలే ఉన్నాయి. ప్ర‌ధానంగా ఇటీవ‌ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల బాధితుల‌కు సాయం చేయాల‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి లేఖ సంధించారు. అయితే..దీనిపై కేంద్రం స్పందించ‌లేదు. మ‌రోవైపు.. పోల‌వ‌రం నిధుల పెంపు లేనేలేద‌ని.. తేల్చేసిన కేంద్రం ఉద్య‌మించాల్సిన స‌మ‌యం. అంతేకాదు.. ఇత‌ర స‌మ‌స్య‌ల‌పైనా.. గ‌ళం విప్పాల్సిన కాలం. మ‌రీముఖ్యంగా రైతుల నుంచి ధాన్యం కొనేదిలేద‌ని చెబుతున్న కేంద్రం సెగ ఏపీకి కూడా త‌గులుతున్న స‌మ‌యంలోదీనిపైనా స్పందించాల్సిన సమ‌యం. కానీ.. ఒక్క‌రంటే ఒక్క ఎంపీ కూడా రాష్ట్ర దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌పై దృష్టి పెట్ట‌లేదు.

కేంద్రాన్ని నిల‌దీయ‌నూ లేదు. కేవ‌లం.. రాజ‌కీయ ప‌బ్బం కోస‌మే కాలాన్ని క‌ర్పూరంగా క‌రిగించి.. `వెళ్లాం.. వ‌చ్చాం..!` అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఆయ‌న‌పై కేసులు ఉన్నాయ‌ని.. సీబీఐ విచార‌ణ‌ను వేగవంతం చేయాల‌ని.. వైసీపీ లోక్‌స‌భా ప‌క్ష నాయ‌కుడిగా మిథున్ రెడ్డి స‌భ‌లోనే ప్ర‌శ్నించారంటే.. వైసీపీ ఎంపీల ప్రాధాన్యం దేనికి ఉంద‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని విశ్లేష‌కులు కూడా నివ్వెర పోతున్నారు. అంతేకాదు.. ప‌దే ప‌దే ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

మ‌రి ఈ త‌ర‌హా స్ఫూర్తి.. ఏపీ స‌మ‌స్య‌ల‌పై ఎక్క‌డ ఉంద‌నేది ప్ర‌జ‌ల మాట‌. ఒక్క మిథున్ మాత్ర‌మే కాదు.. ఎంపీలు నందిగం సురేష్‌, గోరంట్ల మాధ‌వ్ వంటివారు కూడా ర‌ఘురామ కేంద్రంగా పార్ల‌మెంటులో గ‌ళం వినిపించారే త‌ప్ప‌.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై మాత్రం గ‌ళం వినిపించ‌లేదు. మ‌రివీరికి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల క‌న్నా.. ర‌ఘురామ స‌మ‌స్యే ప్ర‌ధాన‌మా? అనే ప్ర‌శ్న ప్ర‌జ‌ల నుంచే వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News