స్వదేశీ హై-స్పీడ్ రైలు బీ-28 ఆవిష్కరణ.. రవాణా రంగంలో సరికొత్త విప్లవం!
వందే భారత్ రైళ్లు ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160-180 కిమీ వేగంతో నడుస్తున్నాయి. కానీ బీ-28 ప్రత్యేకంగా హై-స్పీడ్ కారిడార్ల కోసమే రూపొందించారు.;
భారతీయ రైల్వే చరిత్రలో చారిత్రక ఘట్టానికి నాంది పడింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బీ-28 (B28) హై-స్పీడ్ రైలును మన దేశంలోనే రూపొందించడం ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం. బీఈఎమ్ఎల్ సంస్థ ఆవిష్కరించిన ఈ నమూనా దేశ రవాణా ముఖచిత్రాన్ని మార్చబోతోంది.
భారతదేశం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హై-స్పీడ్ రైలు కల సాకారం అయ్యే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్ల వేగాన్ని చూసి మురిసిపోయాం, కానీ ఇప్పుడు బీఈఎమ్ఎల్ ఆవిష్కరించిన బీ-28 నమూనా అంతకు మించిన వేగంతో ప్రయాణించగలదు. గంటకు 280 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేలా రూపొందించిన ఈ రైలు, ప్రపంచంలోని అత్యుత్తమ హై-స్పీడ్ రైళ్లతో పోటీ పడనుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, మన దేశీయ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించడం విశేషం.
బీ-28 ప్రత్యేకతలు..
ఈ రైలు కేవలం వేగం మాత్రమే కాదు, ప్రయాణికుల సౌకర్యం, భద్రతలో కూడా అత్యుత్తమంగా ఉండబోతోందట. గంటకు 280 కిమీ వేగంతో ప్రయాణించడం అంటే.. 500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. ఇది విమాన ప్రయాణానికి పోటీ ఇవ్వనుంది. రైలు ముందు భాగం గాలిని చీల్చుకుంటూ వెళ్లేలా రూపొందించారు. దీనివల్ల వేగం పెరగడమే కాదు.. విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. జపాన్ లేదా ఇతర దేశాల సాయం లేకుండా, మన ఇంజినీర్లు దీనిని డిజైన్ చేయడం వల్ల తయారీ ఖర్చు తగ్గడడం, భవిష్యత్తులో విడిభాగాల నిర్వహణ సులభతరం అవుతుంది.
వందే భారత్, బీ-28లో తేడాలు ఇవే..
వందే భారత్ రైళ్లు ప్రస్తుతం గరిష్టంగా గంటకు 160-180 కిమీ వేగంతో నడుస్తున్నాయి. కానీ బీ-28 ప్రత్యేకంగా హై-స్పీడ్ కారిడార్ల కోసమే రూపొందించారు. ఈ రైళ్లు ప్రయాణించడానికి ప్రస్తుతం ఉన్న పట్టాలు సరిపోవు. వీటి కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్ లేదా అత్యాధునిక హై-స్పీడ్ ట్రాక్స్ నిర్మించాల్సి ఉంటుంది. యూరప్, జపాన్ దేశాల్లోని బుల్లెట్ రైళ్ల స్థాయికి మన రైల్వేను తీసుకువెళ్లడమే ప్రాజెక్టు ఉద్దేశ్యం.
ఆర్థిక, సామాజిక ప్రభావం
హై-స్పీడ్ రైళ్ల రాకతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గడం వల్ల వ్యాపార వాణిజ్యాలు మెరుగుపడతాయి. ప్రజలు పని కోసం ఉదయం ఒక నగరానికి వెళ్లి, సాయంత్రానికి ఇంటికి చేరుకునే వీలు కలుగుతుంది. విమాన ప్రయాణంతో పోలిస్తే రైలు ప్రయాణం తక్కువ కర్బన ఉద్గారాలను రిలీజ్ చేస్తుంది. ఇది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది. ఈ భారీ ప్రాజెక్టుల వల్ల తయారీ రంగంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.
బీఈఎమ్ఎల్ ఆవిష్కరించిన ఈ బీ-28 నమూనా, భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర పోషించనుంది. అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే, హై స్పీడ్ రైలు పట్టాల మీద పరుగెత్తడం చూడవచ్చు. టెక్నాలజీ పరంగా మన దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా సొంత సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. 2026 చివరి నాటికి పట్టాల మీద కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.