ఇరాన్ ఆర్థిక విలయం.. 2 లక్షల రియాల్స్‌కు ఒక కోడిగుడ్డు..!

యుద్ధం ఆంక్షల వల్ల ఇరాన్ పారిశ్రామిక రంగం కుప్పకూలింది. అధికారికంగా 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెబుతున్నా, ఆ సంఖ్య 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.;

Update: 2026-04-26 06:02 GMT

ప్రపంచ రాజకీయాల్లో గంభీరంగా కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఇరాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఆ దేశంలో కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్‌కు చేరుకుందంటే, ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎంతటి భయానక స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిని నిపుణులు ‘ఆధునిక కరువు’ అని పిలుస్తున్నారు.

ఇరాన్ తన చరిత్రలోనే అత్యంత చీకటి రోజులను గడుపుతోంది. అమెరికా విధిస్తున్న ‘మెక్సిమం ప్రెజర్’ ఆంక్షలు, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ప్రత్యక్ష పోరాటం ఆ దేశ ఆర్థిక వెన్నెముకను విరిచాయి. యుద్ధం సరిహద్దుల్లో ఉంటే, దాని సెగ ఇరాన్ సామాన్యుడి వంటగదిని దహించివేస్తోంది. మార్కెట్లో వస్తువులు ఉన్నా, వాటిని కొనడానికి జేబులో డబ్బులు సరిపోని ఈ పరిస్థితిని ఆర్థికవేత్తలు ‘ఆధునిక కరువు’గా అభివర్ణిస్తున్నారు.

ధరల బాదుడు..

ఇరాన్‌లో ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకోవడం రికార్డనే చెప్పాలి. నిత్యావసరాలైన బియ్యం, గోధుమల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేవు. వంట నూనెల ధరలు 200 శాతం పెరగడంతో సామాన్యుడు వంట చేయడమే మానేసే పరిస్థితి వచ్చింది. ఒక కోడిగుడ్డు 2 లక్షల రియాల్స్‌కు చేరడం అంటే, అక్కడ కరెన్సీ విలువ మట్టిలో కలిసిపోయిందని అర్థం. మనిషి బతకడమే కాదు.., చనిపోవడం కూడా ఇరాన్‌లో ఖరీదైన వ్యవహారంగా మారింది. అంత్యక్రియల ఖర్చులు కూడా 40 శాతం పెరగడం అక్కడి దయనీయ స్థితికి నిదర్శనం.

ఆవిరైన పొదుపు..

ఒకప్పుడు బలంగా ఉన్న ఇరాన్ రియాల్, నేడు ప్రపంచంలోనే బలహీనమైన కరెన్సీగా మారింది. ఒక అమెరికన్ డాలర్ విలువ 16 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. ప్రజలు జీవితకాలం దాచుకున్న సొమ్ము చిత్తు కాగితాలుగా మారిపోయాయి. ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేకపోవడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అప్పులు కట్టలేక చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బ్యాంకులు లక్షలాది ఖాతాలను మూసివేస్తున్నాయి.

పెరిగిన నిరుద్యోగం.. ఆదాయ మార్గాలు శూన్యం..

యుద్ధం ఆంక్షల వల్ల ఇరాన్ పారిశ్రామిక రంగం కుప్పకూలింది. అధికారికంగా 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెబుతున్నా, ఆ సంఖ్య 30 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.

ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ వోచర్లు కనీసం 10 కిలోల బియ్యాన్ని కూడా అందించలేకపోతున్నాయి. 1.5 కోట్ల మంది ప్రజలు ఎటువంటి ఆదాయం లేక పూట గడవని స్థితిలో ఉన్నారు.

స్టాక్ మార్కెట్, పరిశ్రమల పతనం

టెహ్రాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎనిమిది వారాల పాటు మూతపడడం ఇరాన్ చరిత్రలో మొదటిసారి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఆధారమైన పెట్రోకెమికల్స్, స్టీల్ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. మార్కెట్లు తెరిచినా, పెట్టుబడిదారులు లేక స్టాక్ ధరలు పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం వల్ల ఆదాయం తగ్గుతున్నా.., ప్రభుత్వం పన్నులు తగ్గించకపోగా.., ఆలస్యమైతే జరిమానాలు విధిస్తూ ప్రజలను మరింత వేధిస్తోంది.

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం.., ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం 500 శాతానికి చేరుకునే ప్రమాదం ఉంది. ఇరాన్ మరో జింబాబ్వే లేదంటే వెనిజులాగా మారే అవకాశాలు ఉన్నాయి. విదేశీ యుద్ధాల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ఇరాన్ పాలకులు, స్వదేశంలో ఆకలితో చనిపోతున్న ప్రజల గురించి పట్టించుకోకపోతే.. దేశం లోపలి నుంచే కుప్పకూలే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News