జీతం తీసుకోకున్నా.. ఇదండీ అసలైన "ట్రంప్ మార్క్" వ్యాపార సూత్రం..
మరి జీతమే తీసుకోనప్పుడు ఈయన గారేం తింటారు? ఆయన ఖర్చుల సంగతేంటి? అని అమాయకంగా ప్రశ్నిస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నవ్వుకోవాల్సిందే..
"నేను నయా పైసా జీతం తీసుకోను సార్.. నాదంతా సమాజ సేవ" అని ఏ రాజకీయ నాయకుడైనా అంటే మన జనాలు ఆశ్చర్యపోతారో లేదో కానీ.. డోనాల్డ్ ట్రంప్ మాత్రం దీన్ని నిజంగానే చేసి చూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా నెలకు లేదా సంవత్సరానికి వచ్చే ఆ $400,000 డాలర్ల చిల్లర జీతాన్ని "నాకొద్దు బాబోయ్, ఎవరికైనా విరాళంగా ఇచ్చేయండి" అని దానకర్ణుడిలా పక్కన పెట్టేశారు. మరి జీతమే తీసుకోనప్పుడు ఈయన గారేం తింటారు? ఆయన ఖర్చుల సంగతేంటి? అని అమాయకంగా ప్రశ్నిస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నవ్వుకోవాల్సిందే..
అవును అధ్యక్షుడి జీతాన్ని త్యాగం చేసినా ట్రంప్ తాత సంపద మాత్రం రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. ఇటీవల వచ్చిన కొన్ని అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. రెండోసారి వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి రెండేళ్లలోనే ఆయన ఏకంగా 4.2 బిలియన్ డాలర్లు అంటే మన భారతీయ రూపాయిల్లో చెప్పాలంటే వేల కోట్లు సంపదను కూడబెట్టారట. గత 60 ఏళ్లలో సంపాదించలేనిది.. ఈ రెండేళ్లలోనే కొట్టేశారని టాక్!
ఎలా సాధ్యం భయ్యా ఈ మేజిక్?
సాధారణంగా ఎవరైనా ఉద్యోగం మానేస్తే అప్పులపాలవుతారు. కానీ ట్రంప్ స్టైలే వేరు. ఆయనకు అధ్యక్ష పదవి అనేది జస్ట్ ఒక పార్ట్ టైమ్ రోల్ లాంటిది, అసలు కథంతా ఆయన "రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం" లోనే ఉంది. న్యూయార్క్ నుంచి మియామీ వరకు ఉన్న లగ్జరీ బిల్డింగ్‌లు, గోల్ఫ్ కోర్సులు, రిసార్ట్‌లు రూపాయికి పది రూపాయల చొప్పున సంపాదన తెచ్చిపెడుతున్నాయి. "డొనాల్డ్ ట్రంప్" అనే పేరే ఒక అతిపెద్ద బ్రాండ్.. ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఆ బ్రాండ్ విలువ పసిడి కంటే వేగంగా పెరిగిపోతోంది. ఈ మధ్య డిజిటల్ దునియాలోనూ, ప్రైవేట్ పెట్టుబడుల్లోనూ ట్రంప్ మార్క్ గట్టిగానే కనిపిస్తోంది. వైట్ హౌస్ ఇచ్చే జీతం ఆయన గోల్ఫ్ కిట్‌లోని ఒక్క స్టిక్ ఖరీదుకు కూడా సరిపోదేమో.. అందుకే ఆ జీతాన్ని హుందాగా విరాళమిచ్చేసి, అసలైన ప్రాఫిట్స్ వ్యాపారాల ద్వారా పిండుకుంటున్నారు.
అధికారిక లెక్కలా? జస్ట్ అంచనానా?
అయితే ఈ 4.2 బిలియన్ డాలర్ల సంపద వార్తలపై ఇంకా అధికారిక ముద్ర మాత్రం పడలేదు. "ఇది కేవలం మీడియా అంచనా మాత్రమే, కొంచెం ఆగండి" అని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ.. పొగ రాకుండా సెగ పుట్టదు కదా ఏది ఏమైనా "జీతం వదులుకుని పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా" అని చెప్తూనే ఇంకోవైపు గ్లోబల్ బిలియనీర్ల లిస్ట్‌లో టాప్‌లో నిలవడం ఒక్క ట్రంప్‌కే చెల్లింది.
చివరగా ఒక్కటి మాత్రం నిజం.. జీతం పొందే సగటు ఉద్యోగి నెలాఖరుకి పైసల కోసం తంటాలు పడుతుంటే జీతమే వద్దన్న ట్రంప్ తాత మాత్రం వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. ఇదండీ అసలైన "ట్రంప్ మార్క్" వ్యాపార సూత్రం..