నన్నే అంటారా.. ట్రోలర్స్ కు గట్టి షాక్ ఇచ్చిన గడ్కరీ
దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ కలపాలా? లేక ఇథనాల్ లో కొద్దిగా పెట్రోల్ కలపాలా? అనే రేంజ్ లో చర్చ నడుస్తోంది.
దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ కలపాలా? లేక ఇథనాల్ లో కొద్దిగా పెట్రోల్ కలపాలా? అనే రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఒకవైపు "నా పాత బైక్ బండి ఇంజిన్ ఏమైపోతుందో" అని సామాన్య వాహనదారుడు లబోదిబోమంటుంటే ఇంకోవైపు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ సైంటిస్టులు, పొలిటికల్ డిటెక్టివ్‌లు రోడ్డెక్కేశారు. ఈ రచ్చ చాలదన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని టార్గెట్ చేస్తూ రకరకాల ‘కథనాలు’, ఏఐ డీప్‌ఫేక్ మార్ఫింగ్ కళాఖండాలు మార్కెట్లోకి వదిలారు.
అయితే "మేము ఊరికే చూస్తూ కూర్చోం.. తగ్గేదేలే" అంటూ నితిన్ గడ్కరీ గారు నేరుగా బాంబే హైకోర్టు తలుపు తట్టారు. దీంతో ఇప్పటిదాకా లైకులు, షేర్ల కోసం డీప్‌ఫేక్ వీడియోలు వండివార్చిన సోషల్ మీడియా ‘మేధావులకు’ గట్టి షాకే తగిలింది.
"ఇథనాల్ మాది కాదు బాబోయ్!" మంత్రి గారి అసలు బాధ
సోషల్ మీడియా నిపుణుల ప్రకటనల ప్రకారం.. దేశంలో ప్రతి లీటర్ పెట్రోల్ కడిగినా తుడిచినా దాని వెనుక గడ్కరీ గారి కుటుంబ వ్యాపారాలే ఉన్నాయట.. దీనిపై మంత్రి గారు కోర్టు ముందు పెట్టిన పిటిషన్‌లో తన గోడును వెళ్లబోసుకున్నారు.. "అయ్యా అసలు ఇథనాల్ బ్లెండింగ్ కి, నా శాఖరోడ్డు రవాణాకు ఏమైనా సంబంధం ఉందా? అదంతా పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ చూసుకుంటుంది. నా పని రోడ్లేయడం.. కానీ నన్ను పట్టుకుని ఇథనాల్ ఫ్యాక్టరీల అధినేతను చేసేశారు" అని వాపోయారు.
తన కుటుంబానికి ఇథనాల్ వ్యాపారాలతో సంబంధం ఉందంటూ వస్తున్న వార్తలన్నీ "కేవలం ఊహాజనిత కల్పిత గాథలు" అని ఆయన తెగేసి చెప్పారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికే ఈ స్థాయి సృజనాత్మకతను వాడుతున్నారని వాపోయారు.
డీప్‌ఫేక్ రాయుళ్లకు ఏఐ షాక్
ఈ రోజుల్లో ఒకరిని విమర్శించాలంటే పెద్దగా శ్రమపడాల్సిన పనిలేదు. ఒక ఫోటో, కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జ్ఞానం ఉంటే చాలు.. ఎవరో ఒకరి ముఖాన్ని ఎక్కడో అతికించేసి ‘సంచలన వీడియో’ రెడీ చేసేయవచ్చు. గడ్కరీ గారి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆయన రూపాన్ని మార్ఫింగ్ చేసి, డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి వైరల్ చేశారు. "చూశారా ఆయన స్వయంగా ఏం చెప్తున్నారో" అంటూ క్యాప్షన్లు తగిలించి రచ్చ రచ్చ చేశారు. ఇవన్నీ చూసి విసిగిపోయిన గడ్కరీ, చట్టపరమైన బాట పట్టక తప్పలేదు.
హైకోర్టు ఎంట్రీ.. ఇక ఆటలు సాగవు
మంత్రి గారి వాదనలు విన్న బాంబే హైకోర్టు ప్రాథమికంగా ఆయన అభ్యర్థనకు ‘పచ్చజెండా’ ఊపింది. పరువు నష్టం కలిగించేలా ఫేక్ పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలు, ప్లాట్‌ఫారమ్‌లు.. సదరు "డిజిటల్ కవుల"పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కోర్టు అనుమతించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్‌తో ఇన్నాళ్లూ కీబోర్డ్ వెనుక దాక్కుని డీప్‌ఫేక్ వీడియోలతో కాలక్షేపం చేసిన వారికి సీన్ రివర్స్ అయింది.
ఈ20 లొల్లి & సోషల్ మీడియా భవిష్యత్తు
ప్రస్తుతం దేశంలో ఈ20 పెట్రోల్ వాడకంపై మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్లు పాడవుతున్నాయని వాహనదారుల్లో రకరకాల సందేహాలు ఉన్న మాట వాస్తవమే. అయితే ఆ విధానపరమైన నిర్ణయంపై చర్చించాల్సింది వదిలేసి కట్టుకథలు, ఫేక్ వీడియోలతో పరువు తీసే కార్యక్రమానికి దిగడమే ఇక్కడ అసలు సమస్య.
ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక ఇంధన విధానానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా సాగుతున్న ‘డీప్‌ఫేక్ అరాచకానికి’ చెక్ పెట్టే ఒక కీలక మైలురాయిగా మారబోతోంది. ఏది ఏమైనా "లైకులు, షేర్ల కోసం డీప్‌ఫేక్ తో చెలగాటమాడితే.. చివరికి కోర్టు మెట్లు ఎక్కాల్సిందే" అని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.