'టాక్స్ హాలిడే' 20 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు.. విదేశీ ఇన్వెస్టర్లకు ఎర్డొగాన్ బంపర్ ఆఫర్!
కొన్నేళ్లుగా తుర్కియే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. సంపన్న విదేశీయులు దేశానికి రావడం వల్ల విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది.;
ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంతో సతమతం అమవుతున్న తుర్కియే (Turkey), విదేశీ పెట్టుబడులను, సంపన్న వ్యక్తులను ఆకర్షించేందుకు ‘మెగా ఆఫర్’ ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. 20 ఏళ్ల పాటు పన్ను మినహాయింపు అంటే అది సామాన్యమైన విషయం కాదు.. ఇది ఒక దేశం తన ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చుకోవడానికి వేస్తున్న అతిపెద్ద ఎత్తుగడ. తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ ప్రకటించిన ఈ వినూత్న పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ పౌరులపై పన్ను భారాన్ని పెంచుతున్న తరుణంలో, తుర్కియే భిన్నమైన దారి ఎంచుకుంది. విదేశీయులు తమ దేశానికి వస్తే, వారు ఇతర దేశాల్లో సంపాదించే ఆదాయంపై రెండు దశాబ్దాల (20 సంవత్సరాలు) పాటు పన్ను వసూలు చేయబోమని అధ్యక్షుడు రెసెప్ తయ్యబ్ ఎర్డొగాన్ ప్రకటించారు. అంటే, ఒక వ్యక్తి తుర్కియేలో ఉంటూ అమెరికాలోనో లేదా భారత్‌లోనో సంపాదించే లాభాలపై తుర్కియే ప్రభుత్వం ఒక్క లీరా (ఆ దేశ కరెన్సీ) కూడా అడగదు. కేవలం తుర్కియే భూభాగంలో చేసే వ్యాపారాలు లేదా ఉద్యోగాల ఆదాయంపై మాత్రమే పన్ను విధిస్తారు. ఇది అంతర్జాతీయంగా 'డిజిటల్ నోమాడ్స్' బహుళజాతి కంపెనీల యజమానులకు గొప్ప అవకాశంగా కనిపిస్తోంది.
పథకం ఎవరికి వర్తిస్తుంది..?
ఎర్డొగాన్ ప్రకటించిన ఈ పథకంలో కొన్ని కీలకమైన నిబంధనలున్నాయి. గత మూడు సంవత్సరాలుగా తుర్కియేలో పన్ను చెల్లింపుదారులు కాని వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే ఇప్పటికే అక్కడ ఉన్న వారికి కాకుండా, కొత్తగా వచ్చే విదేశీయులను ఆకర్షించడమే దీనిప్రధాన ఉద్దేశ్యం. విదేశాల నుంచి వచ్చే డివిడెండ్లు, వడ్డీలు, అద్దెలు లేదా మూలధన లాభాలపై 20 ఏళ్లు ఎలాంటి పన్ను ఉండదు. వారసత్వంగా వచ్చే ఆస్తులు లేదా బహుమతులపై కేవలం ఒక శాతం మాత్రమే విధిస్తారు. చాలా దేశాల్లో ఇది 15 నుంచి 40 శాతం ఉంటుంది, ఆ కోణంలో చూస్తే ఇది కూడా తక్కువే.
తుర్కియే నిర్ణయం వెనుక కారణాలు..
కొన్నేళ్లుగా తుర్కియే ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. సంపన్న విదేశీయులు దేశానికి రావడం వల్ల విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. దీనివల్ల పడిపోతున్న తుర్కియే లీరా విలువను కాపాడుకోవచ్చు. విదేశీయులు రావడం వల్ల అక్కడి ఇళ్ల అమ్మకాలు, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. పన్నులు రాకపోయినా, విదేశీయులు అక్కడ నివసిస్తూ చేసే ఖర్చులు (షాపింగ్, భోజనం, సేవలు) స్థానిక వ్యాపారులకు, ప్రభుత్వానికి పరోక్ష పన్నుల రూపంలో ఆదాయాన్ని తెస్తాయి.
సవాళ్లు.. విమర్శలు
20 ఏళ్ల పన్ను సడలింపు వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సొంత దేశ ప్రజలు అధిక పన్నులు చెల్లిస్తుంటే, విదేశీయులకు భారీ ఆఫర్లు ఇవ్వడం సామాన్యుల్లో ఆగ్రహం తెప్పించవచ్చు. పన్ను మినహాయింపులు ఉన్న దేశాలు తరచుగా 'టాక్స్ హెవెన్స్'గా మారుతుంటాయి. దీనివల్ల అక్రమ సొమ్ము దేశంలోకి రావచ్చు. తుర్కియేలోని భౌగోళిక రాజకీయ పరిస్థితులు, భూకంపాల వంటి విపత్తుల వల్ల విదేశీయులు ఎంత వరకు వస్తారనేది ప్రశ్నార్థకమే.
దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలు ఇలాంటి రాయితీలతోనే ప్రపంచ ఆర్థిక కేంద్రాలుగా ఎదిగాయి. ఇప్పుడు తుర్కియే కూడా అదే బాటలో నడుస్తోంది. యూరప్, ఆసియా ఖండాల మధ్య వారధిగా ఉన్న తుర్కియే, తన భౌగోళిక స్థానాన్ని వాడుకుంటూ 'పన్ను రాయితీ' మంత్రాన్ని ప్రయోగించింది. ఒకవేళ ఈ పథకం విజయవంతమైతే, రాబోయే పదేళ్లలో ఇస్తాంబుల్ వంటి నగరాలు ప్రపంచ కుబేరులకు కొత్త చిరునామాలుగా మారవచ్చు. పన్నులు తగ్గించి సంపదను సృష్టించాలనే ఎర్డొగాన్ సాహసోపేత నిర్ణయం తుర్కియేను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుందా..? వేచి చూడాలి.