పవన్ కి ముద్రగడతో చెక్... వైసీపీ మాస్టర్ ప్లాన్ ?

Update: 2023-06-10 12:49 GMT
కాపులలో అత్యంత ఆదరణ కలిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి చేర్చుకునేందుకు దాదాపుగా అంతా సిద్ధమైంది అంటున్నారు. రాజకీయంగా రీ ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టివ్ అవుదామనుకుంటున్న ముద్రగడకు వైసీపీ భారీ ఆఫర్ ఇస్తోంది. ఆయనను ముందు నిలబెట్టి గోదావరి జిల్లాలలో పవన్ రూపేణా ఏదురు కాబోతున్న జనసేన ప్రభావాన్ని గట్టిగా ఎదుర్కోవాలని వైసీపీ భారీ స్కెచ్ వేసింది.

ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబుతో పడని విషయమే ఇపుడు వైసీపీకి కలసి వస్తోంది అంటున్నారు. నిజానికి ముద్రగడకు అప్పట్లో జనసేన బీజేపీ నుంచి కూడా ఆఫర్లు ఉన్నాయని ప్రచారం సాగింది. అయితే జనసేన వెళ్ళి టీడీపీతో పొత్తుకు రెడీ అవుతూండడంతో ముద్రగడ ఆ వైపు చూడరని అంటున్నారు. బీజేపీ విషయం తీసుకుంటే ఏపీలో పెద్దగా బలం లేదు, అదే సమయంలో టీడీపీతో చివరి నిముషంలో పొత్తులు ఉంటాయని అంటున్నారు.

ఈ కారణాలతో ఆ పార్టీ వైపు కూడా ముద్రగడ చూడకపొవచ్చు అంటున్నారు. ఈ నేపధ్యంలో ముద్రగడకు ఇపుడు ఏకైక ఆప్షన్ గా వైసీపీ ఉంది అని అంటున్నారు. ముద్రగడకు మంచి అనుచరగణం ఉంది. వారంతా టీడీపీని వ్యతిరేకించిన వారే. వారి మీద టీడీపీ హయాంలోనే కేసులు పడ్డాయి. దాంతో గత ఆరేడేళ్ళుగా వారంతా కోర్టుల చుట్టూ తిరిగి నానా బాధలు పడుతూ వచ్చారు.

ఎట్టకేలకు ముద్రగడతో పాటు వారి మీద కూడా కేసులు కొట్టివేయడంతో రాజకెయంగా తమ నాయకుడు సత్తాను చాటాలని కోరుకుంటున్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో చేసిన పోరాటల తో తెలుగుదేశం ఎంతలా ఇబ్బంది పెట్టిందో ముద్రగడ అనుచరులకు తెలుసు కాబట్టి ఆ పార్టీ వద్దు అనే అంటున్నారు. దాంతో వారు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

అయితే వైసీపీ కాపులకు ఏమైనా గట్టి మేలు చేసిందని చూపించి ఆ పార్టీలో చేరాలని ముద్రగడ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన కాపుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జగన్ సర్కార్ కి కొన్ని డిమాండ్లు పెడతారని అంటున్నారు. వాటి గురించే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే ముద్రగడను వరసబెట్టి వైసీపీ నేతలు కలసి ముచ్చట్లు పెడుతున్నారు. వైసీపీలోకి వచ్చేయాలని రాయబారాలు నడుపుతున్నారు.

మొన్నటికి మొన్న ఎంపీ మిధున్ రెడ్డి ముద్రగడతో భేటీ అయితే నిన్న కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ముద్రగడను కలసి చర్చలు జరపడం ఆసక్తిని రేపుతోంది. ఈ చర్చల సారాంశం బయటకు రాలేదు కానీ కాకినాడ నుంచి ముద్రగడను ఎంపీగా పోటీలో పెడతారు అని అంటున్నారు. కాకినాడ నుంచి ఆయన పోటీలో ఉంటే ఏడు అసెంబ్లీ సీట్లలోనూ వైసీపీకి విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు.

అందుకు ముద్రగడ అంగీకరించకపోతే ఆయన కుమారుడిని ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి ముద్రగడను వైసీపీలోకి తీసుకుని రావడం ద్వారా పవన్ ఫ్యాక్టర్ ని గోదావరి జిల్లాలో అడ్డుకుని గట్టిగా చెక్ చెప్పాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చెసే విషయం ముద్రగడ తన కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ఇక అతి తొందరలోనే ముద్రగడ తన రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారు అని అంటున్నారు. ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖాయమనే అంటున్నారు. ముద్రగడకు ఉన్న మంచి పేరు కాపుల్లో ఆయనకు ఉన్న ఇమేజ్ ఇవన్నీ వైసీపీకి ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

ముద్రగడ కనుక వైసీపీలో చేరితో గోదావరి జిల్లాల రాజకీయ లెక్కలు ఒక్కసారిగా మారిపోతాయని అంటున్నారు. ఆయనకు ఉన్న క్రెడిబిలిటీ వైసీపీకి శ్రీరామ రక్షంగా నిలుస్తుందని, ఫలితంగా ఇప్పటిదాక టీడీపీ జనసేన కాంబో  విషయంలో వేసుకుంటున్న అంచనలౌ కూడా మార్చే శక్తి ముద్రగడకు ఉందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ముద్రగడ ఫ్యాన్ నీడకు ఎపుడు చేరుకుంటారో.

Similar News