అన్నా మ‌నోళ్ల మీదే కంప్ల‌యింట్లిస్తే.. ఏం చేస్తావ్‌? వైసీపీలో ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Update: 2022-11-01 02:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా ఒక కీల‌క‌నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే నెల 2న అత్యంత ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం చేప‌డుతున్నార‌ని.. ఇక‌పై సీఎం జ‌గ‌నే నేరుగా ప్ర‌జ‌ల‌తో ఇంట‌రాక్ట్ అవుతార‌ని.. దీనికి సంబంధించి ఫోన్‌-ఇన్ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నున్నార‌ని తెలుస్తోంది. దీనికి `జ‌గ‌న‌న్న‌కు చెబుతా!` అనే  పేరు కూడా పెట్టిన‌ట్టు స‌మాచారం.  అయితే.. దీనిపై విధివిధానాలు ఇంకా వెలువ‌డాల్సి ఉంది. కానీ,ఈ విష‌యం ఇలా బ‌య‌ట‌కు పొక్కిందో లేదో. అప్పుడే వైసీపీ నేత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. అంతేకాదు.. ఒక్క‌సారిగా వైసీపీలోనూ రాజ‌కీయం హీటెక్కింది.

ఎందుకంటే.. నిజంగానే సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుడితే రెండు విష‌యాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఒక‌టి.. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. వీటిని సీఎంకు లేదా క‌లెక్ట‌ర్ కు వివ‌రిస్తున్నారు. అయితే.. వీరు చెబుతున్న‌వి జ‌గ‌న్ న‌మ్మ‌డం లేదా? అనే డౌట్ ఒక‌టి వ‌స్తోంది. రెండు.. ఇంత చేస్తున్నా.. అంటే.. ప్ర‌భుత్వం ఇన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి పెరిగిపోయింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దీనిని త‌గ్గించేందుకు అయినా అయి ఉండాలి.

ఇక‌, మ‌రో కీల‌క వాద‌న ఏంటంటే.. స‌చివాల‌య వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చారు. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చారు. వాటిద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ్యాప్ లేకుండా రాకుండా చూసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు నేరుగా జ‌గ‌న్ రంగంలోకి దిగుతున్నారంటే ఈ ప్ర‌యోగాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని అనుకోవాలా? అనేది సందేహం.

ఇక‌, ఇవ‌న్నీ ఇలా ఉంటే మ‌రోవైపు.. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫోన్ల‌ను ఎలానూ రికార్డు చేస్తారు. స‌రే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు వైసీపీ నాయకుల‌పైనే ఫిర్యాదు చేసే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

ఎందుకంటే.. వారు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌రు. పైగా.. క‌బ్జా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారు, ఇసుక‌, కంక‌ర వంటి వాటిలో వేలు పెట్టిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఇక‌, అవినీతి ష‌రా మామూలే అనే మాట ప్ర‌జ‌ల నుంచి నిత్యం వినిపిస్తోంది. మ‌రి ఇప్పుడు సీఎం జ‌గ‌న్ నేరుగా ప్ర‌జ‌ల‌తో మాట్లాడితే.. వారి నుంచి సొంత పార్టీ నేత‌ల‌పైనే ఫిర్యాదులు వ‌స్తే ఏం చేస్తారు? అనేది వైసీపీ నేత‌ల‌ను ఠారెత్తిస్తోంది.

ఇది స‌హ‌జం కూడా. ఎందుకంటే చాలా చోట్ల వైసీపీ నేత‌ల్లోనే ఘ‌ర్ష‌ణ పెట్టుకుని ప‌నులు చేయ‌డం లేదు. మ‌రి ఇలాంటివారిపై ప్ర‌జ‌లు ఫోన్‌చేసి నేరుగా జ‌గ‌న్‌కు చెబితే చ‌ర్య‌లు తీసుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. చూడాలి జ‌గ‌న్ ఏం చేస్తారో. నిజంగా ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌గ‌లిగి, ప్ర‌జ‌ల‌కు ఒకింత రిలీఫ్ ఇస్తే ఆయ‌న వ్యూహం స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News