పిలిచి ఎంపీలను చేయం... దీని భావమేమి... ?

Update: 2022-01-17 04:05 GMT
పదవులు అన్నవి స్వీటు కంటే తీయగా ఉంటాయి. వాటి టేస్టే వేరు. ఆ రుచి మరిగిన వారు దాని చుట్టే తిరుగుతూ గింగిరాలు కొడతారు. ఒక విధంగా అది వ్యసనం అవుతుంది. ఇదిలా ఉంటే ఒకపుడు కౌన్సిలర్ పదవి అంటే మహా ఎక్కువగా ఉండేది. కానీ కాలం మారింది. ఇపుడు ఈజీగా సీఎం పోస్ట్ మీద కన్నేస్తున్నారు. ఒకసారి సీఎం కాగానే దేశ్ కీ నేత అంటున్నారు. మొత్తానికి చూస్తే పదవుల చుట్టూ తిరిగే రాజకీయం అయిపోయింది.

ఏ ఇద్దరు కలసినా సీట్ల గురించే తప్ప మరో మాట లేదన్నట్లుగా మీడియాలో కూడా కధలు అల్లుతున్నారు. అలాంటిదే రీసెంట్ గా జగన్ మెగాస్టార్ మీటింగ్. చిరంజీవి వచ్చినది ఒక దాని మీద, కానీ బయట జరిగిన ప్రచారం మరో దాని మీద. దాంతో చిరంజీవికి ఏ రకమైన ఇబ్బంది అయిందో తెలియదు కానీ అధికార వైసీపీకి అయితే  లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా సీన్ క్రియేట్ అయింది అంటున్నారు.

దాంతో ట్రబుల్ షూటర్స్ మెల్లగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జగన్ తో చిరు భేటీ కేవలం సినిమా సమస్యల మీద మాత్రమే అని మంత్రి బాలినేని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఇపుడు జగన్ సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి సీన్ లోకి వచ్చారు. ఆయన కాస్తా ఘాటుగానే మాట్లాడారు, ఎవరినీ పిలిచి రాజ్యసభ సీటు ఇచ్చే అవసరం వైసీపీకి లేదు అంటూ మాట్లాడారు. అంటే ఎంపీ పదవి అన్నది తాము ఊరకే ఎందుకు ఇస్తామన్న ద్వనితో పాటు మేమిచ్చే పదవి అంత తక్కువది కాదు అన్న అర్ధం కూడా ఉంది అంటున్నారు.

దీనికి ముందు తనకు పదవుల మీద ఆశ లేదని, తాను వాటికి ఆకర్షితుడిని తాను కానే కాను అని మెగాస్టార్ చెప్పేశారు. దాంతో రాజ్యసభ పదవులు ఎవరినో పిలీచి ఇవ్వమని, పెద్ద పీట వేయమని వైవీ సుబ్బారెడ్డి అలా రియాక్ట్  అయ్యారనే అనుకోవాలేమో. నిజానికి జగన్ పదవుల పందేరాల గురించి ఆలోచిస్తే ఆయన బయట వారికి పార్టీకి సంబంధం లేని వారికి ఇవ్వరనే అంటారు. గుజరాత్ నేత‌ పరిమళ్ నత్వానీకి జగన్ ఒక రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే దానికి ఢిల్లీలోని బీజేపీ  పెద్దల లాబీయింగ్ ఉందని అంటారు.

ఆ తరువాత ఆయన ఎంపిక చేసిన పదవులు అన్నీ కూడా పార్టీలోని వారికే. అదే విధంగా లైమ్ లైట్ లో ఉన్న వారి కంటే పెద్దగా ప్రచారం లో లేని వారికే ఇస్తూ వచ్చారు. ఇపుడు కూడా ఖాళీ అయ్యే నాలుగు సీట్లకూ అభ్యర్ధుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి విజయసాయిరెడ్డికి, మరోటి శ్రీకాకుళానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి, మరో రెండు కాపులు, ఎస్సీలకు అని అనుకుంటున్నారు.

దీని మీదనే వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే వారికి, కష్టపడేవారికి  మాత్రమే ఎంపీ పదవులు అంటూ క్లారిటీని పక్కాగా ఇచ్చేశారు. మొత్తానికి చూస్తే రోగి కోరిందీ, డాక్టర్ ఇచ్చిందీ ఒక్కటే అన్నట్లుగా ఉంది సీన్. నాకు ఎంతటి పదవి అయినా వద్దు అని మెగాస్టార్ అంటే మేము ఏ పదవి అయినా పిలిచి ఇవ్వమని, అంత అవసరం అవకాశం మాకు లేదని వైసీపీ చెప్పేసినట్లు అయింది.

ఒక విధంగా చిరుకు రాజ్యసభ అన్న  ప్రచారం వల్ల ఆయన పొలిటికల్ ఇమేజి పెరగగా, అదే టైమ్ లో  వైసీపీకే పెద్ద ఇబ్బంది వచ్చి పడింది అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా మెగాస్టార్ ని మచ్చిక చేసుకుంటున్నారు అన్న విషయం బయటకు పోవడం వల్ల ఇపుడు డ్యామేజ్ కంట్రోల్ కి వైసీపీ కాస్తా ఆలస్యంగా అయినా దిగింది అంటున్నారు.
Tags:    

Similar News