భయంతో చావుల అంచుల వరకూ.. భారతీయ విద్యార్థుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.;

Update: 2025-06-16 10:56 GMT

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడులతో టెహ్రాన్‌, ఇతర ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. శబ్దాలు, పేలుళ్ల మధ్య కాలం గడుపుతూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నామని భారతీయులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు ఉన్నారు. అక్కడి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ భారతీయులను స్వదేశానికి తరలించే ప్రత్యేక ఆపరేషన్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలో పేరును ఖరారు చేయనున్నారు. అయితే గగనతల ప్రయాణంపై పరిమితులు ఉన్న నేపథ్యంలో భూసరిహద్దుల మీదుగా తరలించే అవకాశాలు ఉన్నట్టు ఇరాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

ఇరాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఇంతిసాల్‌ మొహిదీన్‌ మాట్లాడుతూ "విమాన దాడుల శబ్దాలతో నిద్ర మానేశాం. రోజూ పేలుడు శబ్దాల మధ్య గడుపుతున్నాం. కాలేజీ బేస్‌మెంట్‌లో కాలం తీయాల్సి వస్తోంది. టెహ్రాన్‌లోని మా యూనివర్శిటీలో దాదాపు 350 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మనం ఎప్పుడు స్వదేశానికి వెళ్లగలమో అనిపిస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ (MEA) స్పందించింది. టెహ్రాన్‌లోని భారత ఎంబసీ నిరంతరం పరిస్థితిని గమనిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఇప్పటికే కొంతమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొంది. మిగిలినవారి కోసం కూడా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

భారతీయులంతా సురక్షితంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యత్నాలు చేస్తుండటం కొంత భరోసానిస్తుండగా, అక్కడి భారతీయులు త్వరితగతిన తాము స్వదేశానికి చేరాలన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News