ఆసియా దేశాల‌పై చైనా వాట‌ర్ వార్‌!

Update: 2016-09-24 09:57 GMT
ఇత‌ర దేశాల‌పై ఆధిప‌త్యం సాధించాలంటే అణ్వాయుధాలే అక్క‌ర్లేదు... నీటితో కూడా క‌ట్ట‌డి చెయ్యొచ్చు అనేది చైనా వ్యూహంగా క‌నిపిస్తోంది. ప్ర‌త్యర్థి దేశాల‌ను దెబ్బ తీసేందుకు జ‌లాస్త్రాన్ని చైనా సిద్ధం చేసుకుంటోంది. ఇదో ఆలోచ‌న‌ను గ‌త కొన్నేళ్లుగా వ్యూహాత్మ‌కంగా అమ‌లు చేస్తూ ఆసియా దేశాల‌పై ఆధిప‌త్యం సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది! చైనా అనుస‌రిస్తున్న విధానాల వ‌ల్ల ప్ర‌పంచం జ‌నాభాలో నాలుగో వంతు ప్ర‌జ‌లు తీవ్ర నీటి ఇబ్బందుల‌కు గురి కావాల్సిన దుస్థితి భ‌విష్య‌త్తులో రాబోతోంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను వివ‌రించేందుకు ‘టిబెట్లో ఆన‌క‌ట్ట‌ల సంక్ష‌భం’ పేరుతో శుక్ర‌వారం ఒక అంత‌ర్జాతీయ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మం జ‌రింది. చైనా అనుస‌రిస్తున్న తీరును నిపుణులు ఈ సంద‌ర్బంగా త‌ప్పుబ‌ట్టారు.

ఇంత‌వ‌ర‌కూ చైనాలో దాదాపు 87 వేలకుపైగా ఆన‌క‌ట్ట‌లు ఉన్నాయి. వాటిలో భీమ‌భాగం టిబెట్ ప్రాంతంలోనే ఉన్నాయి. స‌ల్వీస్ న‌దిపై 24, బ్ర‌హ్మ‌పుత్ర‌పై 11, ఇండ‌స్ న‌ది మీద 2, మైకాంగ్ న‌ది 7... ఇలా చైనా ఆన‌క‌ట్ట‌ల్ని నిర్మించింది. భార‌త‌దేశాన్ని నియంత్రించాల‌న్న దురుద్దేశంతోనే టిబెట్ ప్రాంతంలో ఆన‌క‌ట్ట‌లు ఎక్కువ‌గా నిర్మించింది. అయితే, చైనా అనుస‌రిస్తున్న ఈ జ‌ల‌విధానం వ‌ల్ల ఇండియాతోపాటు, బంగ్లాదేశ్‌, టిబెట్‌, థాయ్‌లాండ్ దేశాలకు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే చెప్పాలి. ప్ర‌పంచంలో 25 శాతం ప్ర‌జ‌ల‌కు జీవ‌నాధారంగా నిలుస్తున్న 10 జీవ న‌దుల జ‌న్మ‌స్థానాలు టిబెట్‌లోనే ఉన్నాయి. దీంతో ఆయా న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల సంఖ్య పెంచ‌డం ద్వారా ఆసియాలోని ఇత‌ర దేశాల‌పై నీటి సంక్షోభాన్ని సృష్టించ‌వ‌చ్చ‌న్న‌ది చైనా దుర్నీతి. జ‌ల‌సంక్షోభంతో ప‌ట్టు సాధించాల‌న్న‌ది చైనా దుర్బుద్ధి.

ఆన‌క‌ట్ట సంఖ్య పెర‌గ‌డం వ‌ల్ల మ‌న‌దేశానికే ఇబ్బందులు ఎక్కువ‌. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌ల‌తోపాటు, విప‌త్తు సమ‌యాల్లో మ‌రిన్ని క‌ష్టాల‌ను మ‌నం ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీ ఆచార్యులు మిలాప్ చంద్ర‌శ‌ర్మ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. భూకంపాలు, ప‌ర్యావ‌ర‌ణ విప‌త్తు సంభ‌విస్తే, ఎగువ‌న ఉన్న జ‌లాశ‌యాల వ‌ల్ల ఇండియాకి చాలా ముప్పు ఉంటుంద‌ని ఆయ‌న వివ‌రించారు. చైనా ఆన‌క‌ట్ట‌లు సంఖ్య‌పై అంత‌ర్జాతీయంగా పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఇప్పుడు ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

నిజానికి, గ‌త ఏడాదే ‘స్టూడెంట్స్ ఫ‌ర్ ఫ్రీ టిబెట్ - ఇండియా’ టిబెట్ న‌దుల ప‌రిస్థితిపై అవ‌గాహ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించింది. టిబెట్‌లో చైనా నిర్మించిన ఆన‌క‌ట్ట‌ల వ‌ల్ల దాదాపు 200 కోట్ల ఆసియా ప్ర‌జ‌లపై ప్రభావం ప‌డుతుంది. భార‌త్‌ను క‌ట్ట‌డి చేసేందుకు నీటిని ఒక ఆయుధంగా చైనా మార్చుకుంటోంది. ఇప్ప‌టికైనా ఆ ప‌ది న‌దుల ప‌రీవాహ‌క దేశాలు ఒక‌టై చైనా తీరుపై పోరాటం ప్రారంభించాల‌ని నిపుణులు కోరుతున్నారు. దేశాల‌న్నీ ఒక‌తాటిపైకి వ‌చ్చి, జ‌ల ఒప్పందాల‌ను కుదుర్చుకోవాల్సిన స‌మ‌యం ఇదే అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags:    

Similar News