ఏపీకి ఆరాధ్యుడు అవుతారా... ?

Update: 2021-10-14 10:30 GMT
ఆరు దశాబ్దాల పాటు రెండు రాష్ట్రాలు కలసి ఉన్నాయి. అభివృద్ధి ఫలాలను కలసి పంచుకున్నాయి. అన్నదమ్ములుగానే ఉంటూ విడిపోయారు. నాడు ఉద్యమ కాలంలో కేసీయార్ అన్న మాటలు ఇప్పటికీ అందరి చెవులలో మారుమోగుతున్నాయి. విడిపోయి కలసి ఉందామని ఆయన చెప్పారు. అంతే కాదు ఎవరికి ఏ కష్టం వచ్చినా రెండవ వారు ఆదుకుంటామని కూడా అన్నారు. ఏడేళ్ల కాలం గడచింది. చిన్న చిన్న సమస్యలు అటూ ఇటూ  వచ్చాయి. అయితే ఇపుడు ఏపీకి అతి పెద్ద సమస్య వచ్చిపడింది. సాయం చేయాల్సిన అన్నదమ్ముడు తెలంగాణాలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం కారణంగా ఏపీ నానా రకాలైన అవస్థలు పడుతోంది.

ఏపీవ్యాప్తంగా ఒక్కో చోట బొగ్గు నిక్షేపాలు తరగిపోవడంతో ఒక్కోటిగా ధర్మల్ పవర్ యూనిట్లు మూతపడుతున్నాయి. ఏపీకి అతి తక్కువ ధరకు విద్యుత్ ని అందించే విశాఖలోని సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ అయిదు వందల మెగావాట్ల తొలి యూనిట్ ని మూసేశారు. ఇలాగే చాలా చోట్ల సాగుతోంది. కేంద్రం సాయాన్ని కోరినా అన్ని చోట్లా ఇదే సమస్య కాబట్టి ఊరట దక్కడం కష్టం. ఈ నేపధ్యంలో అందరి చూపూ తెలంగాణా మీద ఉంది. ఎందుకంటే తెలంగాణాకు సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. విస్తారంగా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.

మరి సాటి తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అంధకారంలో అలమటిస్తూంటే తెలంగాణా సాయం చేయకపోతుందా అన్నదే అందరి ఆలోచన. పైగా ఏడేళ్ళ ముందు వరకూ అంతా ఒక్కటే. అందరూ అన్నదమ్ములే. దాంతోనే అంతా తెలంగాణా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఆలోచిస్తున్నారు. ఇక దీని మీద ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ట్వీట్ చేస్తూ తెలంగాణాకు బొగ్గు నిల్వలు భారీగా ఉన్నాయని, ఏపీకి మాత్రం ఇవ్వడంలేదని అన్నారు. కేవలం శ్రీశైలం లో మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని చెప్పుకొచ్చారు. ఇలా తెలంగాణా విషయంలో హాట్ కామెంట్స్ చేసిన మంత్రి దీన్ని రాజకీయం చేయవద్దని కోరడం విశేషం.

అయితే ఏపీకి బొగ్గు గనులను సరఫరా చేయాలని తెలంగాణా ఈ దశలో అనుకుంటుందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ పరమైన విభేదాలు ఉన్నాయా. ఉన్నా కూడా తెలుగు ప్రజల కోసం సోదర భావంతో కేసీయార్ ముందుకు వచ్చి వెలుగుల రేడుగా మారుతారా అన్నదే చర్చ. ఒక వేళ కేసీయార్ కనుక అలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆయన తెలంగాణా వారికే కాదు ఏపీకి కూడా ఆరాధ్య నాయకుడు అవుతారు. అదే సమయంలో రెండు రాష్ట్రాల మధ్య అసలైన అన్నదమ్ముల అనుబంధం వెల్లివిరియడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News