మేడ్చల్ నుంచి కేసీఆర్ పోటీ.?

Update: 2018-10-30 15:30 GMT
కేసీఆర్ ఈసారి రెండు చోట్ల పోటీచేయబోతున్నారా...? గజ్వేల్ పరిణామాలతో ఆయన మేడ్చల్ నుంచి సైతం పోటీచేసేందుకు సిద్ధపడుతున్నారా.?  గజ్వేల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు - కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరిన వేళ.. సురక్షిత స్థానాన్ని ఎంచుకోవాలని గజ్వేల్ తో పాటు మేడ్చల్ లో కూడా పోటీచేయడానికి సిద్ధపడుతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది.

గత ఎన్నికల్లో కేసీఆర్ కు ధీటైన  కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ నర్సారెడ్డి చివరి నిమిషంలో వైదొలిగి కేసీఆర్ కు మద్దతిచ్చారు. ఈ కారణంగానే కేసీఆర్.. స్థానిక నేత వంటేరు ప్రతాప్ రెడ్డిపై 16000 ఓట్ల తేడాతో మాత్రమే విజయం సాధించారు. కేసీఆర్ గెలిచాక నర్సారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవి ఇచ్చి గౌరవించారు. కానీ ఇప్పుడు పరిణామాలు వేగంగా మారాయి..

ఇటీవల మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతోపాటు గజ్వేల్ నియోజకవర్గంలోని పలువురు ఎంపీపీలు - జడ్పీటీసీలు కూడా హస్తం గూటికి చేరారు. ఇక టీఆర్ఎస్ లో ఉన్న నేతలు కూడా హృదయపూర్వకంగా పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం లేదనే టాక్ వినిపిస్తోంది.  అందుకే పెద్దగా ప్రచారంలో కూడా ఉత్సాహం చూపించడం లేదట..కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రబెల్లి చుట్టుపక్కలే అభివృద్ధి జరిగిందని.. మిగతా ప్రాంతానికి అన్యాయం జరిగిందని స్థానికులు ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. పైగా తమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ తమకు అందుబాటులో లేకపోవడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారట.. ఇక ఎర్రబెల్లిలో కూడా కేసీఆర్ ఫాం హౌస్ లో ఉంటే ట్రాఫిక్ ఆంక్షలు - వీఐపీల రాకతో స్థానిక ప్రజలను కట్టడి చేస్తున్నారని.. ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు..

గజ్వేల్ లో కేసీఆర్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం... నేతలంతా ఒక్కటి కావడంతో ప్రత్యామ్మాయంగా పక్కనే ఉన్న మేడ్చల్ నుంచి కూడా కేసీఆర్ ను పోటీచేయించాలని టీఆర్ ఎస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. మేడ్చల్ పక్కనే ఉండడంతో పర్యటించడానికి కూడా వీలుగా ఉంటుందని భావిస్తున్నారు.

అయితే కేసీఆర్ లాంటి బలమైన నేత రెండు సీట్లల్లో పోటీచేస్తే అవమానంగా చూడవద్దని.. నాడు ఎన్టీఆర్ మూడు సీట్లలో పోటీచేసిన విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.  నరేంద్రమోడీ కూడా వారణాసి - వడోదర నుంచి పోటీచేసిన వైనాన్ని వివరిస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో అంతా తేడా కొట్టడంతో కేసీఆర్ మరో నియోజకవర్గంపై కన్నేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది..
Tags:    

Similar News