పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు సంస్థలు కూడా తమ లాభాలను తగ్గించుకుని వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Update: 2026-05-13 17:49 GMT

పశ్చిమ ఆసియాలో రోజురోజుకూ ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పై కూడా పడే అవకాశముందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రజలపై భారం పడకుండా ఇంధన ధరలను నియంత్రిస్తున్నప్పటికీ.. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తప్పదని ఆయన స్పష్టం చేశారు.

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో మాట్లాడిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఆ ప్రభావాన్ని తాత్కాలికంగా ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, చమురు సంస్థలు కూడా తమ లాభాలను తగ్గించుకుని వినియోగదారులకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం మరింత కాలం కొనసాగితే పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రస్తుతం భారత్ తన చమురు అవసరాల్లో భారీ భాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగితే దేశ దిగుమతి బిల్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీంతో రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని.. అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని కోరారు. అలాగే బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించారు. విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాలను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా దేశంలో ద్రవ్యోల్బణం కూడా మళ్లీ పెరుగుదల దిశగా కదులుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరుకోగా, మార్చిలో ఇది 3.40 శాతంగా నమోదైంది. సరఫరా గొలుసు వ్యవస్థ దెబ్బతినడం, రవాణా వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి వంటి అంశాలు రానున్న నెలల్లో భారత మార్కెట్‌పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటును ఆర్బీఐ 6.9 శాతంగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతంగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే ప్రపంచ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తున్నామని, అవసరమైతే ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ప్రజలు ఇంధన వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించడం, పొదుపు విధానాలను పాటించడం అత్యంత అవసరమని ఆర్థిక వర్గాలు సూచిస్తున్నాయి.

Tags:    

Similar News