టీడీపీలో సూపర్ వార్.. రఘురామ, మహాసేన రాజేశ్ మధ్య యుద్ధం?

అయితే రఘురామ తీరును నిరసిస్తూ రాజేశ్ తన సోషల్ మీడియా అకౌంటులో పెట్టిన పోస్టులో రఘురామ గత చరిత్రను తవ్వడంతోనే ఆయన రియాక్టు అయ్యారని అంటున్నారు.

Update: 2026-05-13 17:42 GMT

టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, పార్టీ యువ నేత మహాసేన రాజేశ్ మధ్య మాటల యుద్ధం ఆసక్తి రేపుతోంది. కొద్దిరోజులుగా అనధికార చర్చిలు తొలగించడంతోపాటు దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్లు పొందడాన్ని తప్పుపడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ మహాసేన రాజేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రఘురామరాజు సొంత నియోజకవర్గంలోని అకివీడులో పెద్దపేట రామాలయం పునఃనిర్మాణం సందర్భంగా మొదలైన వివాదం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఏకంగా దళితులపై పోరులా మారిందని మహాసేన రాజేశ్ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో రఘురామరాజు వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ ఆయన ఇప్పటికీ వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విమర్శించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు.

మహాసేన రాజేశ్ కామెంట్స్ పై బుధవారం స్పందించిన రఘురామ ‘తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో ప్రత్యేక అనుబంధం ఉందని, తమ బంధాన్ని విడదీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పారు. పవన్ అంటే తనకు ఎంతో అభిమానమని, తమ మధ్య గ్యాప్ తీసుకురావాలని భావించడం భ్రమేనంటూ కొట్టిపడేశారు. టీడీపీలో దళితుల తరుపున గట్టి వాదనలు వినిపించే మహాసేన రాజేశ్ కొద్దిరోజులుగా రఘురామ వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నారు. అకివీడు రామాలయం విషయంలో తామంతా రఘురామకు సపోర్టు చేశామని, రామాలయం నిర్మాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. అకివీడులో ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా రఘురామ అనవసరంగా కుల, మతాలను టార్గెట్ చేసి హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే ఆయన డిలీట్ చేసినా రఘురామ రాజు మాత్రం బుధవారం దీనిపై స్పందిస్తూ మహేసేన రాజేశ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

అయితే రఘురామ తీరును నిరసిస్తూ రాజేశ్ తన సోషల్ మీడియా అకౌంటులో పెట్టిన పోస్టులో రఘురామ గత చరిత్రను తవ్వడంతోనే ఆయన రియాక్టు అయ్యారని అంటున్నారు. రఘురామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయ్యారని, ఆ తర్వాత ఇప్పటివరకు మాజీ సీఎం జగన్ ను ఒక్క మాట కూడా అనలేదని ప్రశ్నించారు. పైగా అసెంబ్లీలో జగన్ ను పలకరించడానికి రఘురామ ప్రయత్నించారని, అదే సమయంలో రఘురామను నీచంగా తిట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు రఘురామకు టీడీపీ టికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగితే ‘నాకు సీటు ఇవ్వలేని చంద్రబాబు పోలవరం కడతాను అంటే ఎలా నమ్మాలి’ అంటూ విమర్శించారని అదేవిధంగా భీమవరంలో డీఎస్పీ బదిలీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడారని మహాసేన రాజేశ్ గుర్తు చేశారు.

దీంతో రఘురామ ఘాటుగా స్పందించారు. తన పాత విషయాలను తవ్వడం ద్వారా పార్టీలో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న మహాసేన రాజేశ్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తనకు చంద్రబాబు, పవన్ అంటే ప్రేమ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. మరోవైపు కొన్నిరోజులుగా క్రిష్టియన్లను టార్గెట్ చేస్తున్నట్లు రఘురామ రాజు వ్యవహరించడంపై టీడీపీ కూడా అంతర్గతంగా ఇబ్బంది పడుతోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో మహేసేన రాజేశ్ ను రంగంలోకి దింపి రఘురామకు బ్రేకులు వేయించే ఏర్పాటు చేయించిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం సూచనలతోనే అకివీడు రామాలయ నిర్మాణంతోపాటు రఘురామ వ్యవహారశైలిపై మహాసేన రాజేశ్ స్పందించి ఉంటారని ఆయన వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతోందని అంటున్నారు. అకివీడు రామాలయం విషయంలో హిందువులు ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసాగా మాట్లాడిన మహాసేన రాజేశ్, అదే సమయంలో చర్చ్ ల విషయంలో క్రైస్తవులు కూడా ధీమాగా ఉండాలని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఏ కులానికి, మతానికి అన్యాయం జరగదని, చంద్రబాబు, పవన్, లోకేశ్ ఎవరికీ అన్యాయం జరగనివ్వరని తన పోస్టులో రాసుకొచ్చారు. దీనిని పరిశీలిస్తే రఘురామతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయని, దళితులు, దళిత క్రిస్టియన్లకు భరోసాగా మహాసేన రాజేశ్ ను టీడీపీ వ్యూహాత్మకంగా రంగంలోకి దింపిందని సందేహిస్తున్నారు.

Tags:    

Similar News