యాదాద్రి ట్రస్టు బోర్డు.. రగులుతున్న నల్గొండ
దీనికి కారణం.. ట్రస్టు బోర్డులో సదరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెలవైన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి ప్రాతినిధ్యం లేదన్న వాదనలో నిజం ఎంత? అసలు విషయం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
మిస్టేక్.. బిగ్ మిస్టేక్.. అన్నట్లుగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయాన్ని పలువురు తప్పుపడుతున్న పరిస్థితి. ఏ సెంటిమెంట్ ను టచ్ చేయకూడదో.. ఆ భావోద్వేగం రగిలేలా నిర్ణయాన్ని తీసుకోవటం ఏమిటి? అన్న విస్మయం వ్యక్తమవుతోంది. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ధీటుగా.. తెలంగాణలో యాదాద్రి (యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం) ట్రస్టు బోర్డును ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కారణం.. ట్రస్టు బోర్డులో సదరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నెలవైన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి ప్రాతినిధ్యం లేదన్న వాదనలో నిజం ఎంత? అసలు విషయం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం ఆలయ ఛైర్మన్ తో పాటు మరో పది మంది సభ్యులు బోర్డు మెంబర్లుగా ఉంటే.. మరో ఏడుగురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఛైర్మన్ తో సహా మొత్తంగా పదకొండు మంది జాబితాలో.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారి ప్రాతినిధ్యం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఆలయ ఛైర్మన్ గా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మా అధినేత (ఎంఎస్ఎన్ గ్రూప్) డాక్టర్ మన్నె సత్యానారాయణరెడ్డిని నియమించారు. ట్రస్టులోని బోర్డు సభ్యులుగా మొత్తం పది మందిని నియమించగా.. వారి నేపథ్యాలు కాస్త ఆసక్తికరంగా మారాయి.
పది మంది బోర్డు సభ్యులు.. వారి నేపథ్యాల్ని చూస్తే..
గడ్డం వినోద్ వెంకటస్వామి
(బెల్లంపల్లి ఎమ్మెల్యే)
కొణిదెల సురేఖ
(మెగాస్టార్ చిరంజీవి సతీమణి)
చిల్లప్పగారి విజయ రాజం
(విజయక్రాంతి దినపత్రిక ఛైర్మన్ సీ. లక్ష్మీరాజం సతీమణి)
తూళ్ల విజయేందర్
(దేవేందర్ గౌడ్ కుమారుడు)
గుండు మల్లయ్య
(వ్యాపారవేత్త)
కంఠంనేని స్వాతి
(నాట్కో ఫార్మా కంపెనీ)
ఎం. రాఘవేందర్ రావు
(ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు తండ్రి)
లక్ష్మీనారాయణ నాయక్
(జనగామ కాంగ్రెస్ నేత)
పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్
(ఎల్ బీ నగర్ కు చెందిన కాంగ్రెస్ నేత)
రెండేళ్ల పదవీ కాలం ఉన్న తాజా బోర్డును చూస్తే.. ఈసారి వ్యాపార రంగానికి చెందిన వారికి పెద్దపీట వేసినట్లుగా చెప్పాలి. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు.. రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులకుచోటు దక్కేది. తాజా బోర్డు ఎంపిక విషయానికి వస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఏ రాజకీయ నాయకుడికి చోటు దక్కకపోవటంపై అసంత్రప్తి వ్యక్తమవుతోంది. అయితే.. ఆలయ డెవలప్ మెంట్ విషయంలో రాజకీయ జోక్యం లేకుండా చేయటం కోసమే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పినా.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖుల్ని ఒకరిద్దరిని అయినా ఎంపిక చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణలోని మిగిలిన జిల్లాల సంగతి ఎలా ఉన్నా.. నల్గొండ జిల్లా ప్రజలకు తమ జిల్లా మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఎక్కువన్న మాట వినిపిస్తుంది. నిజానికి ఇది అన్ని జిల్లాలకు వర్తించేదే అయినప్పటికి.. నల్గొండ జిల్లా ప్రజలకు మిగిలిన వారితో పోలిస్తే కాస్త ఎక్కువ జిల్లా అభిమానాన్ని ప్రదర్శిస్తారని చెబుతారు. అలాంటి జిల్లాకు చెందిన వారు బోర్డులో సభ్యులుగా రాజకీయ రంగంలో ఉన్న వారికి చోటు దక్కకపోవటంపై రగిలిపోతున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఎక్స్ అఫీషియో సభ్యులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారు ఉన్నారన్న లాజిక్ ను జిల్లా రాజకీయ నేతలు వినిపించుకోని పరిస్థితి. ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయానికే వస్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు సభ్యులను ఎంపిక చేశారు. ఇదే తీరులో చూస్తే తాజా బోర్డులో నల్గొండకు సరైన ప్రాతినిధ్యం లభించలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి.