రాహుల్ విషెస్‌ ట్వీట్ లో మోడీకి పంచ్!

Update: 2018-04-10 13:23 GMT
అమూల్ బేబీ అంటూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఆట ప‌ట్టించిన రాహుల్ గాంధీలో మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. మోడీపై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో ఈ మ‌ధ్య వ‌ర‌కూ తేలిపోతున్న‌ట్లుగా క‌నిపించిన రాహుల్ ఇప్పుడు అందుకు భిన్నంగా ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. త‌న‌కు ఏ మాత్రం అవ‌కాశం ల‌భించినా.. త‌న ప్ర‌త్య‌ర్థి మోడీపై విరుచుకుప‌డేందుకు ఏ మాత్రం త‌గ్గ‌టం లేదు. చివ‌ర‌కు ఇదెంత వ‌ర‌కు వెళ్లిందంటే.. కొత్త‌గా పెళ్లి చేసుకున్న జంట‌కు శుభాకాంక్ష‌లు చెప్పే విష‌యంలోనూ ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా స‌టైర్లు వేశార‌ని చెప్పాలి.

దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల ప్రేమ పెళ్లి చేసుకున్న సంద‌ర్భంగా రాహుల్ ఒక ట్వీట్ చేశారు. 2015 ఐఏఎస్ టాప‌ర్లు టినా ద‌బీ.. అమిర్ లు గ‌డిచిన కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వారి పెళ్లి విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌టం.. వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావటం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌ని వారు ఇటీవ‌ల జ‌మ్మూక‌శ్మీర్ లోని ప‌హెల్ గామ్ లో పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి నేప‌థ్యంలో వారికి శుభాకాంక్ష‌లు చెబుతూ రాహుల్ ట్విట్ట‌ర్ లో రియాక్ట్ అయ్యారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ టాప‌ర్లు టీనా ద‌బీ.. అథ‌ర్ అమిర్ ఉల్ ష‌ఫీల‌కు వివాహ‌మ‌హోత్స‌వం సంద‌ర్భంగా అభినంద‌న‌లు. మీ ప్రేమ బంధం మ‌రింత బ‌లోపేతం కావాల‌ని.. అస‌హ‌నం.. విద్వేషం పెరిగిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మీ పెళ్లి భార‌తీయులంద‌రికి స్ఫూర్తిగా నిల‌వాల‌ని ఆశిస్తున్నా అంటూ.. త‌న ట్వీట్ సందేశాన్ని పోస్ట్ చేశారు. మోడీ స‌ర్కారు హ‌యాంలో విద్వేషం.. అస‌హ‌నం దేశ వ్యాప్తంగా అంత‌కంత‌కూ పెరిగిపోతున్న‌ట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వివాహ శుభాకాంక్ష‌లంటే ఏదో సింఫుల్ అన్న‌ట్లు కాకుండా.. త‌గ‌లాల్సిన వారికి త‌గిలేలా.. అలా అని త‌ప్పు ప‌ట్ట‌టానికి వీల్లేని విధంగా చేసిన ట్వీట్ తెలివి చూస్తే.. రాహుల్ కాస్త రాటుతేలార‌న్న భావ‌న  క‌ల‌గ‌టం ఖాయం.

Tags:    

Similar News