ప్రపంచ వ్యాక్సిన్ రేసులో మనం ఎక్కడ ఉన్నాం?

Update: 2021-01-26 03:11 GMT
కోవిడ్ కారణంగా ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచ దేశాలకు.. ఇటీవల వచ్చిన వ్యాక్సిన్ కొత్త ఆశల్ని తీసుకురావటమే కాదు.. మహమ్మారిని తరిమి కొట్టగలమన్నభరోసా కలిగింది. ప్రపంచంలోని పలు దేశాల కంటే ముందుగా బ్రిటన్.. అమెరికా.. రష్యా.. చైనా దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే.. స్వల్ప వ్యవధిలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మన దేశం టాప్ టెన్ దేశాల్లో ఒకటిగా నిలిచింది. ఇదో రికార్డుగా చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి వారంలోనే 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ వేసిన వైనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలో పెద్ద ఎత్తున టీకాల్ని సరఫరా చేయటమే కాదు.. నేపాల్.. బంగ్లాదేశ్.. బ్రెజిల్.. మొరాకోలతో సహా పలు దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయటంలో ముందుంది. ఈ నెల 16న దేశంలో వ్యాక్సినేషన్ షురూ చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేవలం వారం వ్యవధిలోనే 12 లక్షల మందికి పైనే వ్యాక్సినేషన్ ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు రెండు వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చినప్పటికి.. సీరమ్ వారి కోవి షీల్డ్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాను పూర్తి స్థాయిలో వినియోగించటం లేదు. కానీ.. అది కూడా పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే.. వ్యాక్సిన్ పంపిణీ మరింత జోరందుకుంటుందని చెప్పక తప్పదు.

వ్యాక్సినేషన్ తొలిదశలో దేశంలోని30 కోట్ల మందికి టీకాలు వేయాలని నిర్ణయించారు. రెండో దశలో దేశ వ్యాప్తంగా 27 కోట్ల మందికి వేయాలని నిర్ణయించారు. అంతేకాదు.. ప్రపంచంలోని పలు దేశాలతో పోలిస్తే.. మన దేశంలోని వ్యాక్సిన్ తయారీ చౌకగా ఉండటం గమనార్హం. ప్రపంచంలోని పలు దేశాలతో పోల్చినప్పుడు ఇప్పటివరకువ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత వేగంగా సాగుతుందన్న విషయానికి సంబంధించి టాప్ టెన్ జాబితాలో భారత్ కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది.

వివిధ దేశాల్లో వ్యాక్సినేషన్ ఇప్పటివరకు ఎంతమందికి వేశారంటే..

అమెరికా     1.84కోట్లు
చైనా          1.5కోట్లు
బ్రిటన్        54.37 లక్షలు
ఇజ్రాయిల్   32.08లక్షలు
యూఏఈ    22.46లక్షలు
జర్మనీ          14.01లక్షలు
ఇటలీ           12.82 లక్షలు
ఇండియా      12.72 లక్షలు
టర్కీ            11.20 లక్షలు
స్పెయిన్       11.03 లక్షలు
Tags:    

Similar News