న్యూ ఇయర్ కు భారీ మర్డర్ ప్లాన్.. సుత్తులు, కత్తులతో వామ్మో అనిపించే ఘటన..

ఉగ్రదాడి అంటే బాంబులు, ఆటోమేటిక్ గన్స్, భారీ పేలుళ్లు అనే ఊహే మన మనసుల్లో మెదులుతుంది.;

Update: 2026-01-03 08:04 GMT

ఉగ్రదాడి అంటే బాంబులు, ఆటోమేటిక్ గన్స్, భారీ పేలుళ్లు అనే ఊహే మన మనసుల్లో మెదులుతుంది. కానీ అమెరికాలో నూతన సంవత్సర వేడుకలకు ముందు బయటపడిన ఒక కుట్ర ఆ నిర్వచనానికి కొత్త అర్థం చెబుతోంది. సుత్తులు, కత్తులు చేతబట్టి జన సమూహాలపై దాడి చేయాలన్న ప్రణాళిక.. వినడానికి సాధారణంగా అనిపించినా, దాని వెనుక దాగి ఉన్న క్రూరత్వం భయంకరమైంది. చివరి నిమిషంలో ఎఫ్‌బీఐ అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పినా.. ఆధునిక ఉగ్రవాదం ఏ దిశగా అడుగులు వేస్తుందో.. గట్టిగా హెచ్చరిస్తోంది.

స్టార్డివెంట్ పేరు వినిపిస్తే భయం..

నార్త్ కరోలినాలోని మింట్ హిల్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల క్రిస్టియన్ స్టార్డివెంట్ పేరు ఇప్పుడు అమెరికా భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. వయసులో చిన్నవాడైనా, ఆలోచనల్లో మాత్రం అతను తీవ్రవాద భావజాలాన్ని పూర్తిగా ఒంటపట్టించుకున్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఐసిస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన క్రిస్టియన్, తనను తాను ఆ సంస్థ ‘సైనికుడు’గా ప్రకటించుకోవడం ఆ ఆలోచనల తీవ్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వేళ జన సమూహాలు ఎక్కువగా ఉండే గ్రోసరీ షాప్, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వంటి ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడాలన్నది అతని ప్రణాళిక.

ఈ ఆయుధాలతో చంపడం అంటే..

ఈ కుట్రలో ఆందోళన కలిగించే అంశం ఆయుధాల ఎంపిక. బాంబులు లేకుండా, తుపాకులు లేకుండా.. సుత్తులు, కత్తులతోనే 20 మందికి పైగా ప్రాణాలు తీయాలన్నది అతని ఆలోచన. ఇది భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలు. ఎందుకంటే ఇలాంటి ఆయుధాలను నియంత్రించడం కష్టం, సాధారణ వస్తువుల్లా కనిపించే ఇవి ఒక్కసారిగా ప్రాణాంతకంగా మారతాయి. దాడికి అవసరమైన దుస్తులు, మాస్కులు, గ్లోవ్స్ సిద్ధం చేసుకొని, ఎవరూ గుర్తించకుండా తప్పించుకోవాలన్న ప్రణాళిక అతను ఎంత ముందుగా ఆలోచించాడో చూపిస్తోంది.

డిసెంబర్ 29న ఎఫ్‌బీఐ అతని ఇంటిపై చేసిన సోదాల్లో లభించిన ‘New Year Attack-2026’ అనే నోట్‌బుక్ ఈ కుట్ర ఎంత తీవ్రతను రూపుదిద్దుకున్నదో బయటపెట్టింది. అందులో లక్ష్యాల జాబితా మాత్రమే కాదు, దాడి తర్వాత పోలీసులపై దాడి చేసి ‘అమరవీరుడు’గా టాగ్ వేసుకోవాలని ఆలోచన ఉంది. ఇది ఒక వ్యక్తి మానసిక వికృతత మాత్రమే కాదు.., ఆన్‌లైన్ తీవ్రవాద ప్రచారం ఎంత ప్రమాదకరంగా యువతను ప్రభావితం చేస్తుందో చూపించే ఉదాహరణ.

ఇక్కడ మరో కీలక ప్రశ్న తలెత్తుతుంది. 18 ఏళ్ల యువకుడు ఇంత తీవ్ర స్థాయికి ఎలా వెళ్లాడు? కుటుంబం, సమాజం, డిజిటల్ వేదికలు ఎక్కడ నియంత్రణ తప్పింది? సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాద భావజాలం యువ మస్తిష్కాల్లోకి సులభంగా చొరబడడం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు దూర దేశాల్లోని ఉగ్రవాద శిబిరాలకే పరిమితమైన ఈ సిద్ధాంతాలు, ఇప్పుడు మొబైల్ ఫోన్ స్క్రీన్ ద్వారానే బెడ్‌రూమ్‌ల్లోకి చేరుతున్నాయి.

ఎఫ్‌బీఐ అప్రమత్తతతో ముందే అరెస్ట్..

ఈ ఘటనలో ఎఫ్‌బీఐ అప్రమత్తత ప్రశంసనీయం. చివరి నిమిషంలో అయినా కుట్రను భగ్నం చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడింది. కానీ ఇదే సమయంలో ఇది ఒక హెచ్చరిక కూడా. ఉగ్రవాదం ఒకే రూపంలో ఉండడం లేదు. ఆయుధాల కంటే ఆలోచనలే ప్రమాదకరంగా మారుతున్నాయి. చిన్న వయసులోనే ద్వేషాన్ని నాటే ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లను గుర్తించి, అరికట్టకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ ఎదురయ్యే ప్రమాదం ఉంది.

క్రిస్టియన్ స్టార్డివెంట్‌ పై నేరారోపణ రుజువైతే 20 సంవత్సరాల వరకు ఫెడరల్ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ శిక్ష ఒక్కటే పరిష్కారం కాదు. ఇలాంటి ఆలోచనలు పుట్టకుండా ముందే అడ్డుకునే వ్యవస్థలు, డిజిటల్ నిఘా, మానసిక ఆరోగ్యంపై దృష్టి ఇవన్నీ కలిసే నిజమైన భద్రతను అందిస్తాయి. సుత్తులు, కత్తులు సాధారణ వస్తువులే కావచ్చు. కానీ వాటిని ఉగ్రవాద ఆయుధాలుగా మార్చే ఆలోచనలను అరికట్టకపోతే, సమాజం మొత్తం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది.

Tags:    

Similar News