ఐపీఎల్ చరిత్రలో సంచలనం.. బంగ్లా ప్లేయర్ ను వద్దన్న బోర్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సంచలనం..! 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒక ప్లేయర్ ను లీగ్ లో ఆడించవద్దు అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదేశించింది.;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సంచలనం..! 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఒక ప్లేయర్ ను లీగ్ లో ఆడించవద్దు అంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదేశించింది. ఐపీఎల్ లో అనూహ్యంగా ఒక క్రికెటర్ ను రిలీజ్ చేయండి అంటూ ఫ్రాంచైజీని కోరింది. అది కూడా లీగ్ చరిత్రలో అత్యంత అధిక ధర దక్కిన ఒక దేశ ఆటగాడి విషయంలో కావడం గమనార్హం. ముంబై దాడుల అనంతరం పాకిస్థాన్ క్రికెటర్లకు చోటు లేకుండా పోయిన లీగ్ లో.. ఇప్పుడు మరొక దేశానికి చెందిన ఆటగాళ్లకు అవకాశం లేనట్లయింది. ఇదంతా కేవలం పొరుగు దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల ప్రభావంతోనే. మొత్తానికి తమ దేశంలో హిందువులపై జరుగుతున్న దాడుల కారణంగా ప్రతిభావంతుడైన బంగ్లాదేశ్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ దాదాపు రూ.10 కోట్లు కోల్పోనున్నాడు. గత నెలలో అబుదాబిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న బంగ్లా క్రికెటర్ గా నిలిచాడు. ఇతడిని కోల్ కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్లకు వేలంలో పాడుకుంది. మార్చి 26 నుంచి జరగనున్న లీగ్ లో అతడు పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇలాంటి సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది.
అక్కడి అల్లర్లు క్రికెట్ పై ప్రభావం
అవసరమైతే 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయగలడు.. లేదంటే 110 కిలోమీటర్ల వేగం స్లో పేస్ కు మారగలడు.. ఇదీ బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ ప్రతిభ. అయితే, బంగ్లాదేశ్ లో ఇటీవల హిందువులు లక్ష్యంగా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కొందరు హిందువులను దాడి చేసి చంపారు. మరికొందరి ఆస్తులను దహనం చేశారు. ఇలాంటి సమయంలో బంగ్లా క్రికెటర్ ను ఐపీఎల్ లో ఆడించవద్దు అంటూ డిమాండ్లు మొదలయ్యాయి. గత రెండు రోజుల నుంచి ఈ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో పేసర్ ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయండి అంటూ కోల్ కతా నైట్ రైడర్స్ ను బీసీసీఐ ఆదేశించింది.
అందినట్లే అంది...
గత నెలలో జరిగిన మినీ వేలానికి ఏడుగురు బంగ్లాదేశ్ క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో కేవలం ముస్తాఫిజుర్ ను మాత్రమే కోల్ కతా తీసుకుంది. షకిబుల్ హసన్ లాంటి మేటి ఆల్ రౌండర్ కూ దక్కనంతగా ముస్తాఫిజుర్ కు రూ.9.2 కోట్ల ధర దక్కింది. అయితే, ఇప్పుడు ఈ మొత్తం డబ్బును ఫ్రాంచైజీ చెల్లిస్తుందా? అనేది చూడాలి. ముస్తాపిజుర్ పై శుక్రవారం వరకు కూడా బీసీసీఐ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. శనివారం నాటికి అంతా మారిపోయింది. ముస్తాఫిజుర్ 2016 నుంచి లీగ్ లో ఆడుతున్నాడు. 60 మ్యాచ్ లలో 65 వికెట్లు తీశాడు. తొలి రెండేళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్, తర్వాత ఒక్కో సీజన్ లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్, రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్, ఒక సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, గత ఏడాది ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు.
ఇక సిరీస్ లూ కష్టమే..
వాస్తవానికి బంగ్లాదేశ్ గత ఏడాది భారత్ లో పర్యటించింది. అప్పటికే ఆ దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని హసీనా భారత్ కు వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత జట్టు బంగ్లా పర్యటన వాయిదా పడింది. దీనికి రీప్లేస్ మెంట్ గా ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరులో భారత జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టి20లు ఆడేలా షెడ్యూల్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది కష్టమే అని చెప్పొచ్చు.