సత్యసాయి జిల్లాలో ఐదుగురి ప్రాణం తీసిన ఉడత?

Update: 2022-06-30 07:30 GMT
శ్రీసత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం నింపిన ఆటో ప్రమాదంలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ప్రమాదంపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందించాలని అనంతపురం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ను ఏపీఎస్ పీడీసీఎల్ హరినాథరావు ఆదేశించారు.

హైటెన్షన్ విద్యుత్ లైన్ పోల్ మీదకు ఒక ఉడత ఎక్కి వైర్ ను షార్ట్ చేయడం వల్ల అది తెగి అటుగా వెళుతున్న ఆటోపై పడిందన్నారు. ఐదుగురు ప్రాణాలు పోవడానికి కారణం ఉడత అని ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామంటున్నారు.

గురువారం ఉదయం తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్ద కోట్ల గ్రామాలకు చెందిన 12 మంది మహిళా కూలీలు పొలం పనుల నిమిత్తం చిల్లకొండయ్య పల్లి గ్రామానికి ఆటోలో వెళుతుంటారు. మార్గమధ్యలో ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగ పడింది. వెంటనే ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి.

ఆటోలో ఉన్న ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందగా.. డ్రైవర్ తోపాటు 8 మందికి గాయాలయ్యాయి. మృతిచెందిన ఐదుగురు మహిళలు 35 ఏళ్లలోపు గృహిణిలే. క్షతగాత్రులను ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read more!

ఈ ఆటోప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్న సీఎంకు ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ఒక ఉడత కారణంగా ఐదుగురు ప్రాణాలు పోవడం విషాదం నింపింది. ఈ కరెంట్ వైర్ తెగడానికి ఉడత కారణమని తెలిసి అంతా షాక్ అవుతున్నారు.
Tags:    

Similar News