పవన్ కో లెక్క ఉందిట... ?

Update: 2021-10-28 14:30 GMT
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఒక డైలాగ్ కొడతారు. నాకు కొంచెం తిక్క ఉంది. దానికి లెక్క ఉంది అంటారు. జనసేనానిగా రాజకీయాల్లోకి వచ్చాక పవన్ కి ఇపుడు పాలిటిక్స్ లెక్కలు కూడా బాగానే వంటబడుతున్నాయి. 2019 నాటి పవన్ మాత్రం 2024లో అసలు కానే కారు, అలా చూడలేరు  అనే అంతా అంటున్నారు. ఆయన ఈసారి  చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. అంతే కాదు తన బలం తో పాటు బలహీనతల‌ను కూడా అంచనా వేసుకుంటున్నారు. దాంతో వాస్తవిక దృష్టితోనే ఆయన వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్ తాను 130 సీట్ల దాకా పోటీ చేశారు. అయితే దక్కింది మాత్రం ఒకె ఒక్క సీటు. ఈసారి అలా కాకుండా పొత్తులు ఉన్నా లేకపోయినా కూడా ఏపీలో యాభై సీట్లను  పవన్ టార్గెట్ చేస్తున్నారు అన్నది టాక్. ఆ యాభై సీట్లో తొంబై శాతం ఉత్తరాంధ్రా, ఉభయగోదావరి జిల్లాలలో ఉన్నాయని చెబుతున్నారు. ఈ అయిదు జిల్లాలలో జనసేనకు మంచి పట్టు ఉంది.

ఆ సంగతి స్థానిక ఎన్నికల్లో కూడా రుజువు అయింది. ఇక్కడే పవన్ సొంత సామాజికవర్గం కూడా గట్టిగా ఉంది. మరో వైపు చూస్తే వీర జన సైనికుల దూకుడు కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో పవన్ ఈ అయిదు జిల్లాల మీదనే పూర్తి ఫోకస్ పెట్టి వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతారు అంటున్నారు. ఇందుకోసం ఆయన సర్వేలు కూడా చేయించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఎక్కువ ఓట్ల శాతం కూడా ఇక్కడే వచ్చింది. అదే సమయంలో కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో జనసేన బలహీనంగా ఉంది.

ఒక వేళ టీడీపీతో పొత్తు కుదిరితే మత్రం పవన్ మేజర్ షేర్ గా ఈ జిల్లాల నుంచే  సీట్లు కోరుతారు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు కచ్చితంగా రావు. ఆ సంగతి చెప్పడానికి ఏ రాజకీయ పండితుడూ అవసరం లేదు, మరే సర్వే కూడా అక్కరలేదు. అయితే వైసీపీ బలం తగ్గి పోయిన సీట్లలో పాగా వేయడానికే జనసేన తనదైన రూట్లో వస్తోంది అంటున్నారు. పైగా గత ఎన్నికల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు ఈ అయిదు జిల్లాలోనే వచ్చాయి. అందువల్ల ఇక్కడ బలం తగ్గిస్తే ఆ పార్టీని అధికారం నుంచి సులువుగా తప్పించవచ్చు అన్న ఎత్తుగడలు కూడా ఉన్నాయట. మరో వైపు చూస్తే జనసేన వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ రోల్ ప్లే చేయాలని చూస్తోంది అన్న మాట కూడా వినిపిస్తోంది.

అంటే మొత్తం 175 సీట్లలో 50 సీట్లను కనుక ఆ పార్టీ గెలుచుకుంటే 2024లో ఏర్పడే ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇచ్చే శక్తి కచ్చితంగా జనసేనకే ఉంటుంది. ఆ పార్టీ మద్దతు లేకుండా ఎవరూ అధికారంలోకి రాలేని సీన్ కూడా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ మొత్తానికి మొత్తం 175 సీట్లలో పోటీకి ఆరాటపడకుండా బలమున్న చోటనే పోటీకి దిగి ఏపీ రాజకీయాలను షేక్ చేయాలని భావిస్తున్నారుట. ఇక బలమైన అభ్యర్ధులను కూడా ఇప్పటి నుంచే ఎంపిక చేసుకుని రంగంలో ఉంచితే రానున్న రోజుల్లో విజయం సులువు అవుతుంది అన్న అంచనా  కూడా వేస్తున్నారుట. మొత్తానికి పవన్ కళ్యాణ్ పొలిటికల్ లెక్కలకు ఒక అర్ధం ఉంది అనే చెప్పాలేమో.
Tags:    

Similar News