ఏమిటీ 'మహా జనసంపర్క్‌ అభియాన్‌'.. మోడీ ప్లాన్ ఏమిటి?

Update: 2023-05-31 10:16 GMT
కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరి తొమ్మిదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా తాము సాధించిన ప్రగతి ని ప్రజల కు తెలిసేలా చేయటం కోసం మోడీ ప్రభుత్వం భారీ కార్యక్రమాని కి తెర తీసింది. దీనికి 'మహా జనసంపర్క్‌ అభియాన్‌' పేరు పెట్టింది. ఈ పేరుతో నెల రోజుల పాటు భారీ ఎత్తున ప్రోగ్రాంల ను చేపట్టాలని.. మోడీ సర్కారు సాధించిన విజయాల్ని మహా గొప్పగా ప్రచారం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో బీజేపీ కూడా కీలక భూమిక పోషించనుంది. మరో ఏడాదిలో లోక్ సభ కు జరిగే ఎన్నికలకు.. ముందుగానే ప్రజల్లోకి వెళ్లటం ద్వారా.. సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మోడీ అండ్ కో ఉన్నట్లు చెబుతున్నారు.

మే 31 నుంచి జూన్ 30 వరకు దేశ వ్యాప్తంగా సభలు..ర్యాలీలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ప్రతి లోక్ సభ పరిధి లోని వెయ్యి మంది ప్రముఖుల్ని కలవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన జాబితా ను సిద్ధం చేశారు. ఇందులో పద్మ అవార్డులు.. రాష్ట్రపతి మెడల్స్ పొందిన వారు ఉండటం గమనార్హం.

దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలకు కలిపి 5.5 లక్షల మందిని కేంద్ర మంత్రులు.. పార్టీ సీనియర్ నేతలు కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రముఖుల కు మోడీ సర్కారు చేపట్టిన డెవలప్ మెంట్ పనుల ను వారికి తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం పది కీలక పథకాల లబ్థిదారుల జాబితానుసిద్ధం చేశారు. వారితో నూ సమావేశాల్ని నిర్వహించనున్నారు.

మొత్తంగా నెల రోజుల వ్యవధిలో 80 కోట్ల మంది ప్రజల్ని కలిసేలా పార్టీ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు.. రాష్ట్రస్థాయి నేతలతో సహా సుమారు 277 మంది ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.  ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు అందరూ జూన్ చివరి పది రోజులు తమ నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లటం తప్పనిసరి చేశారు.

ఈ రోజు (బుధవారం) రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఒక ర్యాలీని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. ప్రధాని మోడీ 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన కీలక నేతలు జేపీ నడ్డా.. కేంద్రమంత్రులు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. నితిన్ గడ్కరీ.. స్మ్రతి ఇరానీ లాంటి వారు కూడా ర్యాలీల్ని నిర్వహించే వారిలో ఉంటారు.

ప్రతి మూడు నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్ని ఒక క్లస్టర్ గా చేస్తారు. అంటే.. 543 నియోజకవర్గాల్ని 144 క్లస్టర్లుగా మార్చి.. ప్రతి క్లస్టర్ లోనూ మంత్రుల తో సహా ఇద్దరు సీనియర్ నేతలు ఎనిమిది రోజులు గడిపేలా చేస్తారు. అదే సమయంలో ప్రజలుమిస్ట్ కాల్ ఇవ్వటం ద్వారా బీజేపీకి మద్దతు తెలిపేలా ఒక మొబైల్ నెంబరును పార్టీ సిద్ధం చేసింది. 9090902024 నెంబరుకు ఫోన్ చేసి బీజేపీ సర్కారు కు తమ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు.

తొమ్మిదేళ్ల తన పాలనలో తాము తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమే అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని అండర్ లైన్ చేసుకొని.. ఒకటికి రెండుసార్లు చదివితే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏమైనా.. రానున్న నెల రోజులు మోడీ సర్కారు గొప్పతనాన్ని చాటేలా కార్యక్రమాలు భారీగా తెర మీదకు రానున్నాయి.

Similar News