ఓరుగల్లు కోటలో ఎగిరేనా ఎన్డీయే జెండా..?!

Update: 2015-07-14 07:30 GMT
సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో రాబోతున్న రెండో ఉప ఎన్నికలు ఇవి. ఇది వరకూ మెదక్ ఎంపీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు వరంగల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పేలా లేవు. అసలు తెలంగాణలో ఇంకా చాలా స్థానాలకు ఉప ఎన్నికలు రావాల్సి ఉంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలందరి మీదా వేటు పడితే గనుక తెలంగాణలోని చాలా అసెంబ్లీ నియోజకవర్గాలక ఉప ఎన్నికలు జరగాలి. అయితే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేల టైమ్ బాగుంది. వారిని అడ్డుకొనే వాళ్లు ఎవరూ లేకుండా పోయారు. దీంతో ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు.

అయితే ఎట్టకేలకూ కేసీఆర్ పాలనపై ఒక రెఫరండంలాంటి ఎన్నిక జరగబోతోంది. కేసీఆర్ ఒప్పుకోకపోయినా.. ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోకపోయినా.. వరంగల్ ఎంపీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలు కేసీఆర్ పాలనకు ఒక విధంగా రెఫరండంలాంటివే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కేసీఆర్ పాలన చూస్తున్న ప్రజలు..ఈ పాలనపై స్పందనలానే వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంది. మరి ఈ తీర్పు ఎలా ఉండబోతోంది? అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం. కేసీఆర్ ధాటిని అడ్డుకోవడానికి ఇంతకు మించిన అవకాశం లేదని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు బావిస్తున్నాయి.
Read more!

అయితే కేసీఆర్ ధాటిని తట్టుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు ఉందా? అనేదే ఇక్కడ పెద్ద సందేహం. అనునిత్యం అంతర్గత కుమ్ములాటల్లో మునిగిపోయి ఉండే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ కు చెక్ చెప్పగలుగుతుంది అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఇక తెలుగుదేశం పార్టీకి కూడా ఓటుకు నోటు వ్యవహారంతో కొంత పరువును పోగొట్టుకొంది. ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బరిలోకి నిలబడుతోంది. ఎన్డీయే తరపున అంటూ.. తెలుగుదేశం మద్దతును కూడా బీజేపీ తీసుకొంటోంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉండనే ఉన్నాడు. ఇలాంటి నేపథ్యంలో.. వరంగల్ లో కేసీఆర్ పార్టీకి కాంగ్రెస్ కన్నా బీజేపీ అభ్యర్థే ఎక్కువ పోటీ ఇచ్చే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పోటీ ఏ స్థాయిలో ఉంటుందో.. ఎంత వరకూ పోరు జరుగుతుందో చూడాలి!
Tags:    

Similar News