కేటీఆర్ మాటలేమో కానీ.. కేసీఆర్ కు భారీ పంచ్ లు పడ్డాయిగా?

Update: 2020-07-15 00:30 GMT
కొన్నిసార్లు అంతే. తమ నోట్లో నుంచి వచ్చే మాటలు తమకే పంచ్ లు పడేలా చేస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ఎదురైంది. విపక్షాలపై విరుచుకుపడేందుకు సమరోత్సాహాన్ని ప్రదర్శించే కేటీఆర్.. తనకు అలవాటైన రీతిలో మరోసారి హితవు చెప్పే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ బీజేపీ నేత  వివేక్ వెంకటస్వామి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అదే పనిగా విమర్శలు చేసే కన్నా.. ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే బాగుంటుందని పెద్ద మనిషి తరహాలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన వివేక్.. ముందు విపక్షాల్ని సీఎం కేసీఆర్ గుర్తించాలన్నారు. ఆయన ఏ రోజైనా విపక్షాలకు సమయం ఇచ్చారా? అని ప్రశ్నించిన వివేక్.. నిజాం పాలనను తలపించేలా టీఆర్ఎస్ సర్కారు ఉందన్నారు.

కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న వేళ.. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సమయంలో సచివాలయాన్ని కూల్చటం ఏమిటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల్ని కేసీఆర్ గుర్తించరన్న వివేక్.. ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా విపక్షాల సలహాలు.. సూచనలు తీసుకొని కీలక నిర్ణయాల్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా కష్టాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ లో కూర్చొని చోద్యం చూస్తున్నారన్నారు.

ప్రతిపక్షాలు సూచనలు ఇస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ అంటున్నారని.. కానీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల్ని అసలు గుర్తించరు కదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. నిజాం సర్కారు తరహాలో విపక్షాల్ని కేసీఆర్ సర్కారు అరెస్టు చేస్తుందని.. బీజేపీ ఎంపీపై దాడి చేయించారన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కేసీఆర్ సర్కారుకు లేదని ఘాటుగా రియాక్టు అయ్యారు. సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాల్ని మంత్రి కేటీఆర్ కోరటం ఏమో కానీ.. తన తండ్రిపై పంచ్ లు పడేలా చేశారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News