చైనాకు ఇప్పుడు తెలిసివ‌స్తోంది

Update: 2016-07-25 16:10 GMT
దక్షిణ చైనా సముద్రంలో హక్కులపై ఐక్యరాజ్య సమితి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పునకు కట్టుబడేది లేదని తొలుత బింకాలు పలికిన చైనా ఆపై ఒక్కో మెట్టూ దిగుతోంది. నాలుగు రోజుల క్రితం ఫిలిప్పీన్స్‌ తో చర్చలకు సిద్ధమని చెప్పిన చైనా ప్రభుత్వం తాజాగా దీవుల నుంచి మిసైల్స్‌ ను తొలగించింది. వూడీ దీవుల్లో మోహరించిన హెచ్‌క్యూ-9 క్షిపణులను రక్షణ శాఖకు చెందిన ఎయిర్‌ బస్ విమానం - 072ఏ రవాణా ఓడలో తరలిస్తున్న చిత్రాలు విడుదలయ్యాయి. ఈ మేరకు చైనా మార్నింగ్ పోస్ట్ పలు శాటిలైట్ చిత్రాలను ప్రచురించింది.

200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను పేల్చివేయగల ఈ మిస్సైళ్లను మోహరించిన తరువాతే దక్షిణ చైనా దీవుల్లో ఉద్రిక్తత మరింతగా పెరిగిన సంగతి తెలిసిందే. వూడీ దీవులు తమ వంటే తమవని చైనా - వియత్నాం వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్షిపణులను చైనా మిలిటరీ బేస్‌ లకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. చైనా సముద్రంలో అమెరికా మోహరించిన యుద్ధ నౌక యుఎస్ ఎస్ జాన్ సి స్టెన్నిస్‌ ను వెనక్కు పిలిపించాలని పెంటగాన్ వర్గాలు నిర్ణయించిన నేపథ్యంలోనే చైనా తన క్షిపణులను ఉపసంహరించిందని తెలుస్తోంది. ముందుస్తు బింకానికి పోయిన చైనా ఆల‌స్యంగా అయిన త‌త్వం అర్థం చేసుకుంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News