కేంద్రమంత్రి రామ్మోహన్ కు అండగా టీడీపీ.. రంగంలోకి పెమ్మసాని, లావు
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సృష్టించిన సంక్షోభంతో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.;
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సృష్టించిన సంక్షోభంతో కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు పలువురు నేతలు, ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశీయ విమానయాన రంగం కేవలం రెండు పెద్ద సంస్థలపై ఆధారపడటం వల్ల ఈ సమస్య తలెత్తిందని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. అంతేకాకుండా ఒక సంస్థలో సమస్య వస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని, దీనికి మంత్రిత్వ శాఖ విధానాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ కు టీడీపీకి చెందిన సహచర ఎంపీలు బాసటగా నిలిచారు.
యువకుడైన రామ్మోహన్ నాయుడు చిన్న వయసులో పెద్దబాధ్యతలు మోస్తున్నారని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారు. దేశీయ విమానయాన రంగం బలోపేతానికి ఆయన ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, రామ్మోహన్ ప్రవేశపెట్టిన విధానాల వల్ల భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇండిగో సంక్షోభానికి కేంద్ర మంత్రిని నిందించడం సరికాదంటూ టీడీపీకి చెందిన మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తోపాటు టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు ట్వీట్లు చేశారు.
ప్రతిపక్షం ఆరోపిస్తున్న గుత్తాధిపత్యాన్ని రామ్మోహననాయుడు తిరస్కరించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ట్వీట్ చేశారు. ఉదాన్ పథకం ప్రవేశపెట్టి దేశంలో విమానయాన రంగం అభివృద్ధికి బాటలు వేసినట్లు ఎంపీ లావు తెలిపారు. ఉదాన్ వల్ల మరిన్ని రూట్లు, మరిన్ని విమానాశ్రయాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త ఎయిర్‌లైన్స్ మనుగడ సాగించడానికి, విస్తరణకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
విమాన మార్కెట్ ఒకటి రెండు సంస్థల చేతుల్లో ఉండకుండా, రెండు లేదా మూడు విమానాలతో ప్రారంభించే చిన్న ఎయిర్ లైన్స్ ను మార్కెట్లో ప్రోత్సహించే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశానికి తక్కువ ఎయిర్‌లైన్స్‌లు కాదు, మరిన్ని ఎయిర్‌లైన్స్‌లు అవసరం. కొత్తగా వచ్చే ప్రతి సంస్థ పోటీని పెంచుతుంది, ప్రయాణీకుల ఇబ్బందులను తగ్గిస్తుంది. ధరలు కూడా భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ఎంపీ తన ట్వీట్ లో తెలిపారు. ఇక ఇండిగో సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. విమాన సర్వీసుల రద్దుపై అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. దీనిపై తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు.
గత ఐదు రోజులుగా ఇండిగో విమానాల్లో అంతరాయం కొనసాగుతోంది. శనివారం కూడా పలు ఎయిర్ పోర్టుల్లో దాదాపు 500కు పైగా దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, అయితే కొన్ని సర్వీసులపై ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.