దేశాన్ని మెల్లమెల్లగా కబలిస్తున్న EMI భూతం..
2025 నాటికి దేశంలోని కుటుంబాల రుణాలు రూ.15.7 లక్షల కోట్లు దాటినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు పెద్దగా అప్పు అనేది ఇల్లు కట్టినప్పుడు లేదా పంట కష్టాల్లో రైతు తీసుకున్న రుణం మాత్రమే ఉండేది.;
దేశం అభివృద్ధి చెందుతున్నదని గర్వంగా చెబుతున్న కాలం ఇది. కానీ అదే సమయంలో దేశంలో సుమారు 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు అనే గణాంకాలు మన ముందు ఉంచినప్పుడు, ఆ ‘అభివృద్ధి’ అనే మాట వెన్నులో వణుకు పుట్టేదిగా మారుతుంది. డెవలప్ అంటే కేవలం పెద్ద బిల్డింగ్‌లు, మెరుస్తున్న మాల్స్, రోడ్లపై కార్ల రద్దీ మాత్రమేనా? లేక కుటుంబాల మీద పెరుగుతున్న అప్పుల భారాన్ని కూడా అభివృద్ధి ఖర్చులో భాగంగా చూడాలా?
పార్లమెంట్ సమావేశంలో మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఇటీవలి పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన లెక్కలు ఈ ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. 2017–2018 నాటికి 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని ప్రభుత్వం అంగీకరించిందంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఖ్య దాదాపు రెండింతలు దాటిందని అర్థం లెక్కలు చెప్తున్నాయి. అంటే చాలా తక్కువ కాలంలోనే కోట్లాది మంది అప్పు అనే బారి కూపం వైపు నెట్టబడ్డారన్న మాట. ఇది ఒక్కో కుటుంబ ఆర్థిక కష్టమే కాదు, దేశ ఆర్థిక పురోగతికి కూడా ఆందోళన కలిగించే విషయం.
2025 నాటికి పెరిగిన EMIలు..
2025 నాటికి దేశంలోని కుటుంబాల రుణాలు రూ.15.7 లక్షల కోట్లు దాటినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు పెద్దగా అప్పు అనేది ఇల్లు కట్టినప్పుడు లేదా పంట కష్టాల్లో రైతు తీసుకున్న రుణం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మారిపోయింది. నగరాల్లో మధ్య తరగతి జీవితమే మొత్తం EMIలపై ఆధారపడి నడుస్తోంది. ఇల్లు కొనాలి – హౌసింగ్ లోన్; కారు కావాలి – ఆటో లోన్; పిల్లల చదువులు: ఎడ్యుకేషన్ లోన్; రోజు వారీ ఖర్చులకే క్రెడిట్ కార్డ్ బిల్లు. ఒక్కో ఇంట్లో 3–4 రకాల EMIలు నెలకొకసారి తలుపు తట్టడం సాధారణమైన విషయంగ మారోపోయింది.
గణాంకాలు చెబుతున్న మరో కఠిన వాస్తవం ఏంటంటే, 2018లో ఒక్కొక్కరికి సగటు అప్పు రూ.3.4 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.4.8 లక్షలకు పెరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థ విస్తరించిన కొద్దీ, ‘డెబ్ట్ ఎకానమీ’ కూడా మరింత మూలాలు కావిస్తుంది. జీతం కొద్దిగా పెరిగినా, దానికి ముందే EMIలు, సర్వీస్ చార్జీలు, వడ్డీలు గుచ్చుకుంటూ ఉంటాయి. చేతిలోకి వచ్చేది మాత్రం మిగిలిపోయిన కాస్తే.
ప్రతి ఏడుగురిలో ఒకరు EMI కడుతున్నారు..
ఈ సంఖ్యలన్నింటినీ ఒకదగ్గర చేరిస్తే, దేశంలో ప్రతి ఏడుగురిలో ఒకరు EMI కడుతున్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. ఆ ఏడుగురిలో ఆ ఒక్కరే కాదు, అతని వెనుక ఒక కుటుంబం నిలబడి ఉంటుంది. మిగిలిన ఆరుగురి అవసరాలు, కలలు, కష్టాలు కూడా ఆ EMI చెల్లింపుల వెంటే సాగే కథలే. అప్పు తీర్చేందుకు ఓవర్‌టైం పని చేసే తండ్రి, అదనపు ట్యూషన్లు తీసుకొని ఇంకా కొంత సంపాదించాలనుకునే లెక్చరర్, విదేశాల్లో చదివి వచ్చి లోన్ చెల్లించేందుకు స్వదేశంలో సరైన ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగి.. వీళ్లందరి అంకెల వెనుక దాగి ఉన్న నిజమైన ముఖాలు.
పెరిగేందుకు కారణం ఇదే..
అప్పు మొత్తాన్ని చూసి ‘ఇది ఎందుకంత పెరిగింది?’ అని మాత్రమే అడిగితే సరిపోదు. ‘ఎందుకు ప్రజలు ఇంత అప్పు తీసుకోవాల్సి వస్తోంది?’ అనే ప్రశ్న అంతే కీలకం. జీవన వ్యయం పెరిగింది, కానీ ఆదాయం పెరగలేదు. అద్దె ఇళ్లు ఖరీదయ్యాయి, పిల్లల విద్య ఖర్చు ఆకాశాన్ని అంటుతోంది, వైద్య సేవలకు వెళ్తే ఒక్కసారి హాస్పిటల్ చూసిన ఖర్చుతోనే చిన్న కుటుంబం ఏడాది బడ్జెట్ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకు, ఫైనాన్స్ కంపెనీ, యాప్ లోన్లు ‘ఇప్పుడే తీసుకో, తర్వాత నెమ్మదిగా చెల్లించు’ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు చూపిస్తే, ఎన్నో కుటుంబాలు ఆ చట్రంలో పడకుండా నిలబడడం కష్టమే.
కొత్త ఫోన్, కొత్త కారు, కొత్త ఫర్నీచర్ – సోషల్ మీడియా కాలంలో ‘లైఫ్ స్టాండర్డ్’ను ‘లైక్ స్టాండర్డ్’గా మార్చేసుకున్నాం. పొరుగింటి వ్యక్తి కొన్న బ్రాండ్ మనకూ కావాలి. ‘ఇప్పుడు EMI లో అందుబాటులో’ అనే లైన్ చూస్తే మనసు తీసుకోవాలని ఉరకలు వేస్తుంది. ఫలితంగా కొన్నేళ్ల తర్వాత మన జీతాన్ని మన మాట వినకుండా మింగేసే వడ్డీలు, పెనాల్టీలు.
సరైనదిగా వినియోగిస్తే అప్పు మంచిదే..
అప్పు ఎప్పుడూ తప్పు కాదు. రైతు పంట పండించేందుకు తీసుకునే పంట రుణం, యువకుడు ఉన్నత విద్య కోసం తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ వీటిని సరైన దారిలో పెడితే ఆర్థిక అభివృద్ధికే వేదికవుతాయి. కానీ గణాంకాలు చెబుతున్నంత భారీ స్థాయిలో అప్పు పెరిగినప్పుడు, దానికి వెనుక ఉన్న విధానాలను, జీవనశైలిని ప్రభుత్వం నుంచి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.
అంచనాల ప్రకారమే లోన్లు: బ్యాంకులు..
బ్యాంకులు, NBFCలు రిస్క్ అంచనా వేస్తూ లోన్లు ఇస్తున్నామని చెబుతాయి. కానీ ఆ రిస్క్ లో బారోయర్ మానసిక ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక భద్రత ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నారు? రీపేమెంట్ విఫలమైతే, కాల్ సెంటర్‌ల నుంచి వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్, హోం విజిట్స్ కారణంగా కొంత మంది ఆత్మహత్యల వరకు వెళ్లిన ఉదాహరణలు ఇప్పటికే మన ముందు ఉన్నాయి. ఇవన్నీ సంఖ్యల్లో కనిపించని, సమాజాన్ని కుదిపే పరిణామాలు.
పాలకులు ఒక కారణం..
బాధ్యతలేని పాలకులు కూడా ఒక కారణం? కుటుంబాల అప్పు భారాన్ని తగ్గించేలా పబ్లిక్ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, అందుబాటు హౌసింగ్ రంగాల్లో నిజమైన పెట్టుబడులు పెట్టకుండా, సబ్సిడీ వడ్డీతో లోన్లు ఇచ్చామని చెప్పుకుంటే సరిపోదు. ఆదాయ అసమానత తగ్గేలా దీనితో పాటు ఉద్యోగావకాశాలు, సురక్షిత వేతనాలు పెంపు వంటి మౌలిక మార్పులు అవసరం. అలాగే, పాఠశాల స్థాయి నుంచే ఫైనాన్షియల్ లిటరసీ అప్పు, వడ్డీ, పొదుపు, పెట్టుబడి వంటి విషయాలను పిల్లలకు నేర్పించడం కాలం డిమాండ్.
ఈ రోజు దేశం ‘డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ అంటూ ముందుకు పరుగెడుతున్నా, వెనుకవైపు EMI ఇండియాగా మారిపోకూడదంటే ఈ గణాంకాలు హెచ్చరికలుగా తీసుకోవాలి. ప్రతి ఏడుగురిలో ఒకరు EMIలతో బతుకుతున్నారని చెప్పే ఈ లెక్క ముందున్న రోజుల్లో ప్రతి నలుగురిలో ఒకరుగా మారకముందే ఆలోచన మార్చుకోవాలి. అప్పు మన స్వప్నాలను నెరవేర్చే సాధనంగా ఉండాలి గానీ, మన జీవితాలను బంధించే గొలుసుగా మారకూడదు.