వైఎస్ ఆర్ - జగన్ ఫొటో లేకుండా 108ను ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే!

Update: 2020-07-06 07:30 GMT
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల పథకం అదీ.. అందుకే ఆయన అమ్ముల పొదిలో ప్రధాన అస్త్రమైంది. ఆయనను జననేతగా నిలిపింది. మరోసారి అధికారం కట్టబెట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన 104 - 108 అంబులెన్స్ సేవలు బాగా హిట్ అయ్యాయి. ప్రజల్లో విస్తృత ఆదరణ పొందాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వైఎస్ ఆర్ పథకం అమలైంది.

అంతటి గొప్ప పథకాన్ని ఆయన కుమారుడు - ఏపీ సీఎం జగన్ సైతం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇటీవల ఘనంగా ప్రారంభించారు. దాదాపు 1088 అంబులెన్స్ లను ఏపీ ప్రజల కోసం ఇటీవలే ప్రారంభించి అన్ని నియోజకవర్గాలు - మండలాలకు పంపారు. వైఎస్ జగన్ ప్రజారోగ్యం విషయంలో తీసుకున్న ఈ శ్రద్ధకు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ప్రముఖ జర్నలిస్టులు - రాజకీయ నాయకులు - సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.

అసలు 108 అంబులెన్స్ లకు పురుడుపోసిన  వైఎస్ ఆర్ ను గుర్తు పెట్టుకోని తెలుగు ప్రజలు ఉండరు. అలాంటి వ్యక్తి ఫొటో పెట్టకుండా.. అదేవిధంగా ఏపీలో ఓకేసారి 200 కోట్ల బడ్జెట్ తో 1088 వాహనాలు కొని సేవలు ప్రారంభించిన సీఎం జగన్ ఫొటో పెట్టుకోకుండా ఒక ఎమ్మెల్యే ఏకంగా 104 అంబులెన్స్ సేవలు ప్రారంభించేయడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.. ఏదో తన ఇంట్లోంచి ఇవన్నీ కొని పెట్టుకున్నట్టు ఫొటోలకు ఫోజులిచ్చేశారని వైసీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారట.. ఈ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది.

తాజాగా 108లను వైఎస్ ఆర్ - జగన్ ల ఫొటోలు లేకుండా కేవలం ఆ ఎమ్మెల్యే ఫొటోనే ఫ్లెక్సీలో పెట్టుకొని ప్రారంభించడంపై చిలకూరిపేట ప్రజలు - వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కార్యక్రమాన్ని వైఎస్ ఆర్ - జగన్ ఫొటోలు లేకుండా ఎలా మొదలుపెడుతారని.. పూర్వం నుంచి ఉన్న వైఎస్ ఆర్ అభిమానులు - ఏపీ సీఎం జగన్ అభిమానులు  ఆందోళనలో ఉన్నారని లోకల్ గా చర్చించుకుంటున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News