మంట పుట్టేలా తొగాడియా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Update: 2017-04-06 04:26 GMT
స‌మ‌స్య‌కు ప‌రిష్కారం మాట‌లే కావాలే కానీ..మాట‌లు తూటాలు ఎంత‌మాత్రం కాదు. ఇష్యూ ఎంత పెద్ద‌దైనా క‌లిసి కూర్చొని మాట్లాడుకోవ‌టం.. రాజీ ఫార్ములాలో నిర్ణ‌యం తీసుకోవ‌టం ద్వారా.. అశాంతికి చెక్ పెట్టేయొచ్చు. వివాదాల‌కు శాంతియుత పరిష్కారాల్ని ప‌క్క‌న పెట్టేసి.. ఇష్టారాజ్యంగా మాట్లాడేసే ధోర‌ణితో ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా వారిని బ‌లంగా ఖండించాల్సిందే. ఈ దేశంలోని అంద‌రి మ‌నోభావాలు ముఖ్య‌మే. మెజార్టీల‌కు ఒక న్యాయం.. మైనార్టీల‌కుమ‌రో న్యాయం అన్న‌ది ఉండ‌కూదు.

కొన్ని సంద‌ర్భాల్లో మైనార్టీల ప‌ట్ల ప‌క్ష‌పాతంతో కొన్ని నిర్ణ‌యాల్ని తీసుకున్న వేళ‌.. వాటిని అర్థం చేసుకొని స‌ర్లే అనుకునే మెజార్టీ వ‌ర్గాన్ని త‌ప్పుదారి ప‌ట్టించేలా.. వారిని ఉద్రేక‌పరిచేలా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా ఖండించాల్సిందే. అన్నింటికి మించి.. తొంద‌ర‌పాటు మాట‌లు ఏమాత్రం మంచివి కావ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇదంతా ఎందుకంటే.. వీహెచ్‌ పీ అంత‌ర్జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు ప్ర‌వీణ్ తొగాడియా తాజా వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా ఉండ‌ట‌మే.

ద‌శాబ్దాల త‌ర‌బ‌డి న‌లుగుతున్న స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న వేళ‌.. ఆ వాతావ‌ర‌ణాన్ని దెబ్బ తీసేలా ప్ర‌య‌త్నించ‌టాన్ని అస్స‌లు ఆమోదించ‌కూడ‌దు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా అయోధ్య విష‌యాన్ని కోర్టు బ‌య‌ట ఉభ‌యుల‌కు అంగీకార‌యోగ్య‌మైన రీతిలో ప‌రిష్క‌రించుకోవాల‌న్న భావ‌న‌ను ముస్లింలోని కొన్నివ‌ర్గాలు ఓకే చెబుతున్న వేళ‌.. అవాకులు చెవాకులు పేల‌టం.. వారి మ‌నోభావాల్నిదెబ్బ తీసేలా మాట్లాడ‌టం ఏ మాత్రం హ‌ర్ష‌నీయం కాదు. అలిండియా షియా ప‌ర్స‌న‌ల్ లా బోర్డు ఒక అడుగు ముందుకేసి.. అయోథ్య విష‌యాన్ని క్లోజ్ చేయాల‌న్న మాట‌నే కాదు.. ముస్లిం పురుషులు ఎంత‌కూ నో చెప్పే ట్రిఫుల్ త‌లాక్ మీద నిషేధం.. హిందువులు దైవంగా పూజించే గోవధ మీద నిషేధాన్ని విధించేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్న వేళ‌.. బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించ‌టం స‌రైంది కాదు.

తాజాగా నిర్వ‌హించిన శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల్లో భాగంగా హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో నిర్వ‌హించిన శోభాయాత్ర‌లో పాల్గొన్న తొగాడియా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో రామ‌రాజ్య స్థాప‌న మొద‌లైంద‌ని.. అయోధ్య‌లో రామ‌మందిరం నిర్మిస్తామ‌న్నారు. ఒక్క అడుగు కూడా ప‌క్క‌కు జ‌ర‌గ‌మ‌ని.. దీన్ని అడ్డుకునే వారు దేశ‌ద్రోహులుగా మిగిలిపోతార‌ని.. బాబ్రీ చిహ్నానికి అవ‌కాశాల్లేవ‌ని వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల కొంద‌రు అయోధ్య వివాదాన్ని ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకొని ప‌రిష్క‌రించుకోండ‌ని అంటున్నార‌ని.. రామ‌మందిరం గురించి ఐసిస్‌.. ఉగ్ర‌వాదులు.. దేశ‌ద్రోహుల‌తో చ‌ర్చించాలా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ముస్లింలంద‌రిని గంప‌గుత్త‌గా ఇలాంటి వ్యాఖ్య‌లు తీవ్ర అభ్యంత‌ర‌క‌ర‌మ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మంగోలియా నుంచి వ‌చ్చిన బాబ‌ర్ మ‌న దేశాన్ని దోచుకున్నాడ‌ని.. అలాంటి చోట స్మార‌క నిర్మాణాలు ఎందుని ప్ర‌శ్నించారు.

హిందువుల్ని ఏహ్య‌భావంతో చూస్తున్న ముస్లింలు.. హిందువులు చెల్లిస్తున్న ప‌న్నుల వ‌ల్లే హ‌జ్ యాత్ర‌కు రాయితీల‌తో వెళ్తున్నార‌ని.. వారి పిల్ల‌లు ఉన్న‌త చ‌దువులు చ‌దువుకుంటున్నారంటూ తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. తొగాడియా మాట‌లు ఇప్పుడు కొత్త క‌ల‌క‌లానికి దారి తీస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News