మండలి రద్దు ..మనసులో మాట బయటపెట్టిన సీఎం!

Update: 2020-01-27 13:28 GMT
శాసనమండలి రద్దు చేస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నానని అసెంబ్లీలో  ఏపీ సీఎం జగన్  ప్రకటించారు. ఇప్పుడు కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తుంటే.. రాజకీయ ప్రయోజనాల కోసం మండలిలో  అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. కొద్దిరోజులు మండలిని కొనసాగిస్తే - మరో ఏడాదిలో తమకు మెజార్టీ వస్తుందని తెలిసినా కూడా  ప్రజల కోసం రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. పార్టీ అవసరాల కంటే ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని సీఎం జగన్ చెప్పారు.

ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి.. రాజ్యాంగానికి తూట్లు పొడిచినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. టీడీపీ అధినేత చంద్రబాబులా నేను ఆలోచిస్తే.. ఆయనకు ప్రతిపక్షనాయకుడి హోదా ఉండదని గతంలోనే చెప్పాను. దిక్కుమాలిన రాజకీయాలు చేయడానికి మేం చట్టసభలకు రాలేదు. రాజకీయాలను మార్చడానికే అధికారంలోకి వచ్చాం. మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని గురువారమే చెప్పాం. మేం ఎమ్మెల్సీలకు రూ.5 కోట్లు ఆఫర్‌ చేశామని ప్రచారం చేశారు’’ అని సీఎం జగన్ అన్నారు. 

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు. 133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ వెల్లడించారు.  వ్యతిరేకంగా కానీ తటస్థంగా కానీ ఒక్క ఓటు కూడా పడలేదు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం మండలి రద్దు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.


Tags:    

Similar News