వెంకయ్య మంచి మాట బాబుకు చేదుమాత్రే!

Update: 2018-01-02 02:30 GMT
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో - ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చాలా కాలం నుంచి చాలా మంచి సత్సంబంధాలే ఉన్నాయి. తాను కేంద్రమంత్రిగా ప్రభుత్వంలో చక్రం తిప్పినంత కాలమూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ లబ్ధి కలిగించడానికి వెంకయ్యనాయుడు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఏపీలో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారీ.. చంద్రబాబునాయుడును ఆకాశానికి ఎత్తేస్తూ.. కీర్తిస్తూ వచ్చారు. కానీ.. చంద్రబాబునాయుడు దురదృష్టం అన్నట్లుగా ఆయన కేబినెట్ నుంచి... పంజరం లాంటి ఉపరాష్ట్రపతి పోస్టులోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయినా సరే... వెంకయ్యనాయుడు ఇప్పటికీ.. అనధికారికంగా.. తన పరిధిలోని వ్యవహారాలు కాకపోయినా.. కేంద్ర మంత్రుల్ని తన చాంబర్ కు పిలిపించుకుని.. ఏపీకి కల్పించాల్సిన ప్రయోజనాల గురించి వారితో తరచూ సమీక్షిస్తూ ఉండడం జరుగుతూ ఉంది.

ఇదంతా ఒక ఎత్తు కాగా.. వెంకయ్యనాయుడు తాజాగా నూతన సంవత్సరంగా చెబుతున్న మంచి మాటలు మాత్రం , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేదు మాత్రలుగా మారే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా.. డిసెంబరు 31 నాటికే విజయవాడలోని తన కూతురు ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టుకు వచ్చేసిన వెంకయ్య నాయుడు... అక్కడ మీడియాతో ముచ్చటించారు. అనేక విషయాలను ఆయన వారితో పంచుకున్నారు. ఇటీవల కేంద్రంలో వివాదాస్పదంగా మారిన తన నిర్ణయాల విషయంలో కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఇద్దరు ఎంపీలను అనర్హుల్ని చేస్తూ రెండు నెలల గ్యాప్ లోనే నిర్ణయం తీసుకున్న వెంకయ్య వైఖరి చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో.. ప్రజాప్రతినిధుల అనర్హత విషయానికి సంబంధించి.. ఫిర్యాదులు వస్తే.. రెండు నెలల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తేల్చేయాలన్నది నిబంధన అంటూ వెంకయ్యనాయుడు మర్మం చెప్పారు. తాను స్పీడుగా నిర్ణయం తీసుకున్నందుకు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది సంజాయిషీ లాగా అనిపించవచ్చు గానీ... నిజానికి ఏపీ - తెలంగాణ స్పీకర్ల అలసత్వ ధోరణికి చెంపపెట్టు లాంటి మాట అనిపలువురు భావిస్తున్నారు. ఏపీలో అయితే.. అనర్హత ఫిర్యాదుల్ని ఎదర్కొంటున్న నలుగురికి తన కేబినెట్ లో చోటు ఇచ్చి.. వారు తప్ప తనకు వేరే దిక్కే లేదన్నట్లుగా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారు. మరి.. వారి అనర్హతల విషయంలో సత్వర నిర్ణయాలు ఉండాలనే.. వెంకయ్యనాయుడు మాటలు.. ఆయనకు చేదుగా ధ్వనించడంలో వింతేముంది అని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News