ఇదే పాత వెంకయ్య అయితేనా?

Update: 2017-07-25 04:47 GMT
తన అవినీతికి సంబంధించి ఇప్పుడు ఎడా పెడా ఆరోపణలు రాగానే వెంకయ్యనాయుడు బహుశా తొలిసారి వాటికి జవాబు చెప్పాల్సివచ్చింది. అదే కేంద్రమంత్రిగానో... భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడిగానో ఆయన ఉండివుంటే ఇలాంటి ఆరోపణల గురించి ఎవరైనా ఆయన ఎదుట ప్రస్తావించుంటే... ఒక్క మాటలో వాటన్నింటినీ కొట్టి పారేసేవారు. ఇలాంటి పిచ్చి పిచ్చి సందేహాలకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అని ఒకే వాక్యంతో ఆయన అన్నింటినీ తోసిపుచ్చివుండేవారేమో. కానీ ఇప్పుడు ఉన్న నేపధ్యం వేరు. ఆయన ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్ధి. దేశంలోనే రాజ్యాంగబద్ధమైన రెండో అత్యున్నత పదవికి ఆయన ఎంపిక కాబోతున్నారు. ఈ పదవిని అధిష్టించే నేపధ్యంలో ఆయన అలవిమాలిన అవినీతికి పాల్పడ్డాడంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణల గురించి కనీసం సంజాయిషీ చెప్పుకోకపోతే అది తన పదవికి పదవిలోకి వెళ్లే ప్రయత్నాలకి అడ్డుగోడగా నిలుస్తుందనే ఆలోచన వెంకయ్యనాయుడులో కలిగినట్టుంది. అందుకే అంశాలవారీగా తన మీద వెల్లువెత్తిన ఆరోపణలకు ఆయన జవాబు చెప్పుకున్నారు

వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి అయిన తరువాత దేశానికంతటికీ ఆయన మంత్రి అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల పట్ల ప్రత్యేక అభిమానం కనవరుస్తున్నారనేది సర్వత్రా వినిపించే మాట. బీజేపీ అధినాయకత్వం వెంకయ్య పట్ల కాస్త కినుకగా ఉండడానికి కూడా ఇదే కారణం అనేది పలువురు భావిస్తూవుంటారు. అయితే వెంకయ్యనాయుడు చంద్రబాబునాయుడితో ఉన్న దోస్తీ కారణంగా ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువ లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించడాన్ని అర్ధం చేసుకోవచ్చుగానీ తెలంగాణ రాష్ట్రానికి అదే క్రమంలో అంతే చేయడానికి ప్రయత్నించడమనేది ఎలా అర్ధంచేసుకోవాలి. ఈ అనుమానాల్నుంచి పుట్టిందే తెలంగాణ ప్రభుత్వంనుంచి ఆయన వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ఆరోపణ. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక మినహాయింపులు పొందారు అనేది వెంకయ్యనాయుడు మీద తొలి ఆరోపణ. అలాగే వెంకయ్యనాయుడు కొడుకు హర్షా ఆధ్వర్యంలో నడుస్తున్న టోయోటా వాహన డీలర్‌ షిప్ వ్యాపారం నుంచి తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఇవ్వదలుచుకున్న ఇన్నోవా కార్లన్నింటినీ టెండర్ లేకుండా సరఫరా చేశారని దీంట్లో భారీగా ముడుపులు చేతులు మారాయనికూడా ఒక ఆరోపణగా వినిపిస్తోంది. అయితే తమాషా ఏంటంటే ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలన్నింటినీ పోగుచేసి ఒక జాతీయ టీవీ చానల్ వెంకయ్యనాయుడిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఒక వైపు ఆయన ఉపరాష్ట్రపతి పదవిలో వెళ్లడానికి అభ్యర్ధిగా బరిలో నిల్చునివున్న సమయంలో పనిగట్టుకుని ఎక్కడెక్కడివన్నీ కెలికి ఆయన మీద ఆరోపణల మీద ప్రత్యేక బులెటిన్ చేయడంమంటే దాని వెనుక ఉద్దేశం ఎమిటో స్పష్టంగా అర్ధంచేసుకోవచ్చు. వెనుక ఎవరు వుండి ఆ కార్యక్రమాన్ని నడిపించారో కూడా అర్ధంచేసుకోవచ్చు. అయితే ఎవరూ దానికోసం ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్లుగా ఛానెల్ లో కార్యక్రమం వచ్చిన మరురోజే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ తెర మీదకు వచ్చారు. అచ్చంగా బులెటిన్ లో టీవీ ఛానల్ ప్రస్తావించిన అన్ని ఆరోపణలను ఆయన తానే కనుగొన్న కొత్త సంగతుల్లాగా మీడియా మీట్ లో బయటపెడుతూ వెంకయ్య చిత్తశుద్దినీ నిరూపిచుకోవాల్సివుందని సవాలు విసిరారు.

సాధారణంగా అయితే ఇలాంటి రాజకీయ గిమ్మిక్కులకు చౌకబారు టెక్నిక్కులకు వెంకయ్య లొంగేవాడు కాదేమో. ఒకవేళ మీడియా వాళ్లు అదే పనిగా గుచ్చిగుచ్చి ప్రశ్నించినా కూడా తనకు బాగా అలవాటైన అంత్యప్రాస డైలాగులో అలాటి ప్రశ్నలను సమర్ధంగా తిప్పికొట్టగలిగివుండేవారేమో. కానీ ఆయన ఇప్పుడు మునుపు ఉన్నంత స్వేఛ్చ ఉన్న నాయకుడు కాదు. రాజ్యాంగబధ్ధమైన పదవిలోకి వెళుతున్నవారు తనను ఒకరు వేలెత్తి చూపినప్పుడు తనకి జవాబు చెప్పకుండా తప్పించుకోవడం ఇప్పుడు ఆయన  పాడి అనిపించివుండకపోవచ్చు. అందుకే ప్రతి అంశానికి విపులంగా సమాధానం ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థలకు మినహాయింపులు ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వపు విచక్షణలో ఉన్న అంశమని తన కూతురు నడుపుతున్న సంస్ధకు మాత్రమే కాకుండా అనేక సంస్ధలకు అలా ఇస్తుంటారని దీనిని ప్రశ్నించజాలరని ఆయన పేర్కొన్నారు. అలాగే తన కుమారుడి వ్యాపారంలో తను ఎన్నడూ జోక్యం చేసుకుంటున్నదిగూడా లేదని అంటూనే అవి అక్కడి ప్రభుత్వ నిబంధన మేరకే ఆ వ్యాపారం జరిగిందని కూడా అయన సంజాయిషి చెప్పుకున్నారు. అయితే వెంకయ్య అవినీతి గురించి ప్రస్తావించాల్సివస్తే ఇవన్నీ డొల్లతనం నిండిన ఆరోపణలుగానే కనిపిస్తున్నాయి. సరైన నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేని కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక రకంగా బురద చల్లి తమను మరో సారి ఓటమి గురిచేయడానికి సిద్ధపడుతున్న ఉపరాష్ట్రపతి అభ్యర్ధిని బద్నాం చేయాలని అనుకున్నట్టుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News