రాజ్యాంగం పరిధిలోనే వ్యవస్థలు పనిచేయాలి: వెంకయ్య

Update: 2020-11-25 17:35 GMT
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ తన పరిధి దాటిందనే ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కోర్టు తీర్పులు కలిగిస్తున్నాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనదని.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఏదీ ఒకదానిపై మరొకటి ఉన్నతమైనదిగా చెప్పుకోకూడదని తెలిపారు. రాజ్యాంగం పరిధిలోనే ఈ మూడు వ్యవస్థలు పనిచేయాలని సూచించారు. గుజరాత్‌లోని కేవడియాలో జరిగిన 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ఈ కామెంట్స్ చేశారు.

ప్రతి విభాగం ఇతర విభాగాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా పని చేసుకోవడంలోనే సామరస్యం ఉంటుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.. దీనివల్ల పరస్పర గౌరవం, బాధ్యత, సంయమన భావం ఏర్పడుతుందన్నారు. దురదృష్టవశాత్తూ హద్దులు దాటిన సందర్భాలు కొన్ని కనిపిస్తున్నట్లు తెలిపారు. పరిధి దాటినట్లు స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించే కొన్ని తీర్పులు ఉన్నాయని వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ ఎగ్జిక్యూటివ్‌గా, సూపర్ లెజిస్లేచర్‌గా న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తోందనే భావన కలిగే విధంగా వ్యవహరించడం వాంఛనీయం కాదని వెంకయ్య అన్నారు.

అప్పుడప్పుడు కోర్టులు తమ పరిధి దాటి శాసన, కార్యనిర్వాహక విభాగాల పరిధిలో ప్రవేశిస్తున్నాయా? అనే ఆందోళనలు రేకెత్తుతున్నాయని వెంకయ్య అన్నారు. కొన్ని అంశాలను ప్రభుత్వంలోని ఇతర విభాగాలకు వదిలిపెట్టి ఉండవలసిందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయన్నారు.

ఈ క్రమంలోనే పలు ఉదాహరణలను వెంకయ్య చెప్పుకొచ్చారు. దీపావళి బాణసంచా కాల్చడంపై ఇచ్చిన తీర్పును, న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కార్యనిర్వాహక శాఖ పాత్రను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. వెంకయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Tags:    

Similar News