‘ఫంజాబ్’ సెంటిమెంట్ ను సంధించిన సిద్ధూ

Update: 2016-07-25 09:48 GMT
గత కొద్దిరోజులుగా మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తున్న మాజీ క్రికెటర్.. రాజకీయవేత్త.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ గళం విప్పారు. తాను బీజేపీ నుంచి బయటకు ఎందుకు వచ్చింది? దానికికారణం ఏమిటి? తనను బీజేపీ ఎంతలా ఇబ్బంది పెట్టిందన్న విషయాల్ని వెల్లడించటమే కాదు.. పంజాబ్ సెంటిమెంట్ ను బయటకు తీసిన ఆయన.. బీజేపీపై తనదైన గుగ్లీని సంధించారు. తనను పంజాబ్ నుంచి దూరం చేసే ప్రయత్నం బీజేపీ చేసిందని.. తాను పంజాబ్ కోసం పని చేస్తానని.. తనకు అన్నింటికంటే పంజాబ్ రాష్ట్ర ధర్మమే గొప్పదిగా తేల్చేశారు.

పంజాబ్ కంటే తనకే పార్టీ ఎక్కువ కాదన్న ఆయన.. తనకు ఓటేసి.. నాలుగుసార్లు ఎంపీగా గెలిపించిన ప్రజల కోసం తాను దేనినైనా వదిలేస్తా కానీ పంజాబ్ ప్రజల్ని మాత్రం వదిలేదని తేల్చేశారు. తొలిసారి సెలబ్రిటీ అన్న కారణంగా గెలిచి ఉండొచ్చని.. కానీ.. మిగిలిన మూడుసార్లు తాను పని చేయటం వల్లనే గెలిచానని.. తనను గెలిపించిన ప్రజలకు తాను ఎంతో చేయాల్సి ఉందన్నారు. అందుకే తనకిచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నట్లు వెల్లడించారు.

‘‘ఇక్కడి ప్రజలను నేను ఎలా వదులుకుంటాను? నాలుగుసార్లు గెలిచిన తర్వాత పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నారు. ఎందకని అడిగాను? ఏం తప్పు చేశానని ప్రశ్నించాను. బీజేపీ ఇలా చేయటం ఇదే మొదటిసారి అయితే వదిలేసేవాడ్ని. కానీ.. ఇది మూడోసారి.. నాలుగోసారి.2014 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి లేదంటే పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయమన్నారు. నేను ఎప్పుడూ పంజాబ్ .. అమృత్ సర్ లకే పని చేయాలని అనుకుంటున్నా’’ అంటూ ఎంత సెంటిమెంట్ కుమ్మరించాలో అంతగా కుమ్మరించటం విశేషం. ఇంతటి సెంటిమెంట్ సమ్మోహనాస్త్రాన్ని కమలనాథులు ఎలా ఎదుర్కొంటారో?
Tags:    

Similar News