డిసెంబరు 25న దేశంలో వ్యాక్సినేషన్.. ఆ రోజే ఎందుకు?

Update: 2020-12-09 05:20 GMT
ప్రపంచం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. నిన్నటి నుంచి బ్రిటన్ లో కొవిడ్ వ్యాక్సిన్ వేయటం షురూ చేశారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రతికూలాంశాలు నమోదు కాలేదు. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు వ్యాక్సిన్ ను తమ దేశంలో షురూ చేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారత్ లో ఎప్పటి నుంచి కోవిడ్ టీకాను షురూ చేస్తారన్న సందేహాలకు తాజాగా ప్రభుత్వం సమాధానం చెప్పేసింది. ఈ నెల 25 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు.

ఇంతకీ డిసెంబరు 25 నుంచే ఎందుకు? అంటే.. ఆ రోజుకు కొన్ని లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. మొదటిది క్రిస్మస్ పర్వదినం కావటం.. రెండో ముఖ్యమైన అంశం మాజీ ప్రధాని వాజ్ పేయ్ జయంతి కావటం. ఈ రెండు కీలక అంశాల్ని పరిగణలోకి తీసుకొని డిసెంబరు 25 నుంచి దేశంలో వ్యాక్సిన్ వేయాలని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే.. కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేసిన తర్వాత.. మిగిలిన ప్రాజెక్టుల మాదిరి వచ్చే మైలేజీ గురించి పట్టించుకోకకుండా విడుదల చేసి ఉంటే బాగుండేది.

ఒక రోజు ముందు విడుదలైనా.. దాని కారణంగా ఎంతోకొంతమందికి మేలు జరుగుతుంది. అలాంటిది.. డేట్ వాల్యూ ఉండేలా వ్యాక్సిన్ ప్రారంభాన్ని ఆలస్యం చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. సాంకేతికంగా డిసెంబరు 25న వ్యాక్సిన్ వేయటానికి పచ్చజెండా ఊపినా.. ఫ్రంట్ లైన్ వర్కర్లకు అందుబాటులోకి రావటానికి మాత్రం జనవరి 15 వరకు పడుతుందని అంచనా వేస్తున్నారు. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. ఆ తర్వాత మిగిలిన వారికి ఇవ్వనున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత అరగంట పాటు వ్యాక్సిన్ వేసిన చోటే ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ఇంటికి వెళ్లిపోవచ్చు. లేదంటే మాత్రం వైద్యసేవలు చేస్తారు. తొలిదశలో 3 కోట్ల వ్యాక్సిన్లను నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబరు 25న ప్రధాని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత.. వాటిని అన్ని రాష్ట్రాలకు అందజేస్తారు. జనవరి 15న అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ మొదలు పెడతారు. తొలుత కరోనాపై పోరులో సేవలు అందించిన వైద్యసిబ్బందికి.. తర్వాత సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ ఇస్తారు.

వ్యాక్సిన్ విషయంలో పలు కంపెనీల వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలుత ఒకరికి ఏ కంపెనీవ్యాక్సిన్ ఇస్తారో.. అదే వ్యక్తికి పదిహేను రోజుల తర్వాత అదే కంపెనీ వ్యాక్సిన్  తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా అనుకోని రీతిలో సైడ్ ఎఫెక్టులు వస్తే.. అలాంటి వారికి వైద్యసాయం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నారు.
Tags:    

Similar News