బండికి అప్ గ్రేడేషన్.. ఈటల కు ప్రమోషన్?

Update: 2023-05-20 09:49 GMT
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీ అధినాయకత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తాము చేస్తున్న తప్పుల గురించి వారికి అర్థమయ్యేలా చేసింది. మరోనాలుగైదు నెలల్లో నాలుగు రాష్ట్రాల్లో కీలక అసెంబ్లీ ఎన్నికలు జరిగే వేళలో.. యుద్ధ ప్రాతిపదికన డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాల్ని చేపట్టటం షురూ చేశారా? నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏ మాత్రం తేడా కొట్టినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుందన్న విషయాన్ని అధినాయకత్వం అర్థం చేసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.

గడిచిన నాలుగైదు రోజలు గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాల్ని చూస్తే.. తెలంగాణ బీజేపీకి సంబంధించిన కీలక నిర్ణయాల కు  సంబంధించిన పరిణామం ఖాయమన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ ని ఒక స్థాయికి తీసుకెళ్లే విషయంలో బండి ఘన విజయాన్ని సాధించినప్పటికీ.. అందరికి ఆమోదయోగ్యంగా కనిపించే విషయంలో బండికి ఉన్న పరిమితుల్నిఅధిష్ఠానం గుర్తించిందని చెబుతున్నారు.

అందుకే.. బండి కి డిమోషన్ కమ్ అప్ గ్రేడేషన్ ఇవ్వాలని.. ఈటల రాజేందర్ కు డబుల్ ప్రమోషన్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు.. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న సునీల్ బన్సల్ తో మేధోమధనం చేస్తున్నారు.

ఢిల్లీ  లోనే పార్టీజాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి.. మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు. శుక్రవారం రాష్ట్ర పార్టీఅధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం కీలకనిర్ణయాన్ని ప్రకటిస్తుందా? అన్నది ఉత్కంటగా మారింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు అవసరమైన కొత్త టీంనుసిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించటం.. కొత్త ఎన్నికలకమిటీ ఛైర్మన్ ను .. ప్రచార కమిటీ ఛైర్మన్ల ను  ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. అదే జరిగితే.. బండికి డిమోషన్ కమ్ అప్ గ్రేడేషన్ అవుతుందని.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటలను ఎంపిక చేయటం ద్వారా ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చినట్లు అవుతుందంటున్నారు. మరి.. దీని పై బండి ఎలా రియాక్టు అవుతారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

Similar News