తలపతి విజయ్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ సిద్ధమవుతోందా?

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో విజయ్ పేరును చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.;

Update: 2026-01-20 02:30 GMT

ఒకవైపు రాజకీయ అరంగేట్రం.. మరోవైపు సీబీఐ విచారణ.. తమిళనాడులో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న తలపతి విజయ్‌కు 'కరూర్ తొక్కిసలాట ఘటన' పెను సవాలుగా మారింది. నిర్లక్ష్యంతో కూడిన హత్యారోపణలు ఎదుర్కోబోతున్నారా? ఈ పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఉందా లేక చట్టం తన పని తాను చేసుకుపోతుందా? తాజా విచారణ ఏం చెబుతోంది అన్న దానిపై ఆసక్తి రేపుతోంది. తమిళ రాజకీయాల్లో 'తలపతి' విజయ్ చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిసేలాగానే పరిణామాలు కనిపిస్తున్నాయి. గతేడాది కరూర్‌లో 41 మంది ప్రాణాలను బలిగొన్న ఆ విషాద ఘటన.. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రయాణానికి అగ్నిపరీక్షగా మారబోతోందా? ఫిబ్రవరిలో సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్, కోలీవుడ్ స్టార్ భవితవ్యాన్ని ఏ మలుపు తిప్పనుంది?

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు, ఇప్పుడు కరూర్ ఘటన ఒక పెద్ద సవాలుగా మారింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణను వేగవంతం చేసింది.

విచారణలో కీలక ప్రశ్నలు

జనవరి 19న జరిగిన రెండో విడత విచారణలో సీబీఐ అధికారులు విజయ్‌ను సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. ప్రధానంగా మూడు అంశాలపై అధికారులు దృష్టి సారించారు. షెడ్యూల్ ప్రకారం కాకుండా విజయ్ వేదిక వద్దకు ఏడు గంటలు ఆలస్యంగా ఎందుకు వచ్చారు? ఈ ఆలస్యం వల్ల జనం అసహనానికి గురై తొక్కిసలాట జరిగిందా? అని విచారణలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు. భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించేందుకు నిర్వాహకులు ఎందుకు విఫలమయ్యారు? తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనకుండా విజయ్ ఎందుకు వెంటనే చెన్నైకి వెళ్ళిపోయారు? అని ప్రశ్నించినట్టు తెలిసింది.

ఛార్జ్‌షీట్‌లో 'విజయ్' పేరు?

జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఫిబ్రవరి రెండో వారంలో సీబీఐ దాఖలు చేయనున్న ఛార్జ్‌షీట్‌లో విజయ్ పేరును చేర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 'కల్పబుల్ హోమిసైడ్' నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించడం అనే తీవ్రమైన సెక్షన్ కింద ఆయనపై ఆరోపణలు మోపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

రాజకీయ రంగు పులుముకున్న కేసు

ఈ వ్యవహారం ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్/ప్రతిపక్షాల పోరుగా మారింది. విజయ్‌ను భయపెట్టి ఎన్డీఏ (ఎన్డీఏ) కూటమిలోకి లాగేందుకే కేంద్రం సీబీఐని వాడుకుంటోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీ దీనికి కౌంటర్ ఇస్తోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాజకీయాలకు దీనికి సంబంధం లేదని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు..

నెక్ట్స్ ఏంటి?

విజయ్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలం ఒక ప్రమాదమని దీన్ని రాజకీయ కక్ష సాధింపుగా మార్చవద్దని వారు కోరుతున్నారు. ఛార్జ్‌షీట్‌లో విజయ్ పేరు ఉంటే ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇది ఆయన రాబోయే ఎన్నికల ప్రచారానికి ఆటంకంగా మారవచ్చు.

తమిళనాడులో సినిమా గ్లామర్, రాజకీయం ఎప్పుడూ విడదీయలేనివి. కరూర్ ఘటన విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీస్తుందా లేక సానుభూతి పవనాలు సృష్టిస్తుందా అనేది ఫిబ్రవరిలో సీబీఐ దాఖలు చేసే ఛార్జ్‌షీట్‌పైనే ఆధారపడి ఉంది.

Tags:    

Similar News