స్పీకర్‌కు సుప్రీం మళ్లీ నోటీసులు... ఏం జరిగింది?
మరో ముగ్గురు ఎమ్మెల్యేల(సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి) విచారణ కొనసాగుతోందని గత విచారణలో సుప్రీంకోర్టుకు తెలిపారు.;
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావుకు సుప్రీంకోర్టు సోమవారం తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. బీఆర్ ఎస్ నుంచి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు శాసన సభ్యుల వ్యవహారంపై స్పీకర్ తీర్పు ఇచ్చారు. వారెవరూ పార్టీ మారలేదని.. దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవని ఆయన తెలిపారు.
మరో ముగ్గురు ఎమ్మెల్యేల(సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి) విచారణ కొనసాగుతోందని గత విచారణలో సుప్రీంకోర్టుకు తెలిపారు. వీరి విచారణ పూర్తి చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని కూడా కోరారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే.. మరోవైపు.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల సమయంలోగా.. పది మంది ఎమ్మెల్యేలను విచారించి.. తీర్పు చెప్పాల్సిన స్పీకరర్ కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలను మాత్రమే విచారించారని.. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంటూ.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ ధిక్కరణ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే.. ఇది కూడా.. పాత కేసుతో ముడిపడి ఉన్నందున అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని పేర్కొంది. అదేసమ యంలో .. ధిక్కర పిటిషన్‌పై మీరు ఏమంటారు? అని ప్రశ్నిస్తూ.. స్పీకర్ ప్రసాదరావుకు తాజాగా సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.న ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి సమాధానం చెప్పాలని స్పీకర్‌ను ఆదేశించింది.