అది వార్నింగే అయినా... వింటే జగన్ కే మంచిదా?

Update: 2021-12-06 05:38 GMT
డిమాండ్ల పరిష్కారం నేపథ్యంలో ఉద్యోగ సంఘం నేత జగన్మోహన్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పడాల్సొస్తుందన్నట్లుగా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఉద్యోగుల వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కోవాలన్నట్లుగా ఉద్యోగ సంఘం నేత బండి శ్రీనివాసరావు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.

నిజానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 5 లక్షలే కానీ టీచర్లు+రిటైర్డ్ ఉద్యోగులు అందరు కలిసి సుమారు 13 లక్షల మంది ఉంటారని బండి చెప్పారు.

ప్రతి ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగుల ఇంటిలో కనీసం 5 ఓట్లున్నట్లు బండి లెక్క చెప్పారు. అంటే సుమారుగా 60 లక్షల ఓట్లుగా ఉద్యోగసంఘం నేత చెప్పిన లెక్క వినటానికి మాత్రం కరెక్టుగానే ఉంది. కాకపోతే బండి చెప్పినట్లుగా ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులు మొత్తం 13 లక్షల మంది బండి మాట వినాలనేమీ లేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంతమంది ఉద్యోగ సంఘాల నేత బండి మాట వింటారు అన్నది కాకపోయినా అనవసరంగా ఉద్యోగులను ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలన్నదే ఆలోచించాలి.

బండి చెప్పిన లెక్కల ప్రకారం 60 లక్షల ఓట్లంటే సగటున 60 నియోజకవర్గాలని అనుకోవాలి. మరింతమంది కాకపోయినా ఇందులో సగం ఓట్లు అధికారపార్టీకి వ్యతిరేకంగా పడతాయని అనుకున్నా తక్కువలో తక్కువ 30 నియోజకవర్గాలని అనుకోవాలి.

కాబట్టి ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లయిన పీఆర్సీ అమలు, డీఏల విడుదల, సీపీఎస్ రద్దు లాంటి కీలకమైన వాటిని పరిష్కరించేస్తే చాలావరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమైపోయినట్లే అనుకోవాలి.

నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమనే పేరుంది. కాబట్టి ఈ పేరును చేతులారా చెడగొట్టుకోవటం వల్ల నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదు. నిజానికి ఇపుడు వివాదమవతున్న పీఆర్సీ అమలవ్వాల్సింది చంద్రబాబునాయుడు ప్రభుత్వంలోనే. అలాగే రెండు డీఏలను చంద్రబాబు ప్రభుత్వమే బకాయి పెట్టింది. ఇపుడా సమస్య పెరిగి జగన్ ప్రభుత్వానికి చుట్టుకుంది.

ఉద్యోగుల సంఘాలు ఎలాగూ ఈనెల 7వ తేదీ నుంచి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపధ్యంలోనే బండి శ్రీనివాసరావు చేసిన హెచ్చరికలను ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి.

ఎందుకైనా మంచిది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టాప్ ప్రయారిటి ఇస్తే ఉద్యోగులకు, ప్రభుత్వానికి కూడా మంచిది. కాబట్టి బండి వార్నింగును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందనే అనుకోవాలి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.


Tags:    

Similar News