తోమర్ రాసిన లేఖలో ఏముంది?

Update: 2020-12-18 04:20 GMT
మూడు వారాలకు పైనే వణికించే చలిని పట్టించుకోకుండా.. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్నివెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో మొదలైన ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా పాకటమే కాదు.. మోడీ సర్కారుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే పలు దఫాలుచర్చలు జరిపినా.. రాజీ మాత్రం కాలేదు. అంతేకాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది మోడీ సర్కారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటివేళ.. ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. తాజాగా రైతులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖను దేశ ప్రజలంతా చదవాలని.. మరింత మంది చేత చదివించాలని కోరారు. దీంతో.. తోమర్ రాసిన లేఖలో ఏముందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశ ప్రజలంతా కేంద్రమంత్రి రాసిన లేఖనుచదవాలన్న సందేశం నేపథ్యంలో.. ఆ లేఖలో ఏమున్నదన్నది చూస్తే..

కనీస మద్దతుధరపై కొంతమంది చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. కనీస మద్దతు ధరపై వారు చెప్పేవన్ని  అసత్యాలేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు.. కనీస మద్దతు ధరపై లిఖితపూర్వక లేఖ రాయటానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని సంఘాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. రూమర్లను ప్రచారం చేస్తున్నట్లుగా మండిపడ్డారు.

‘అలాంటి వారిని బయటకు పంపటం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినందుకు నా బాధ్యత. వాళ్లు రైలు పట్టాలపై కూర్చొని రైళ్లనుఆపుతున్నారు. దాని ద్వారా మన సైనికులు సరిహద్దుల్లోకి చేరుకోలేకపోతున్నారు’ అంటూ మరో ఆసక్తికర వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. రైతు ఉద్యమంలో కీలకమైన మద్దతు ధరపై కేంద్రం హామీ ఇస్తానని చెబుతున్నా.. ఎట్టి పరిస్థితుల్లో మూడు చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎట్టి పరిస్థితుల్లో చట్టాల్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మోడీ సర్కారు తేల్చి చెబుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News