బ్యాంకింగ్ రంగంలో ‘ఈసీఎల్’ షాక్.. లోన్లు రావడం ఇక కష్టమేనా? ఆర్‌బీఐ కొత్త రూల్ ఏంటి?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకువస్తున్న ఈ ECL (ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్) విధానం భారత బ్యాంకింగ్ చరిత్రలో పెను మార్పునకు శ్రీకారం చుట్టబోతోందా అంటే ఆర్బీఐ అవుననే చెప్తోంది.;

Update: 2026-04-29 06:25 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకువస్తున్న ఈ ECL (ఎక్స్‌పెక్టెడ్ క్రెడిట్ లాస్) విధానం భారత బ్యాంకింగ్ చరిత్రలో పెను మార్పునకు శ్రీకారం చుట్టబోతోందా అంటే ఆర్బీఐ అవుననే చెప్తోంది. ఏప్రిల్, 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల వల్ల బ్యాంకులు అప్పులిచ్చే తీరు, సామాన్యులు అప్పులు పొందే విధానం మారనున్నాయి.

భారత బ్యాంకింగ్ వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చేందుకు ఆర్‌బీఐ రోడ్ మ్యాప్ డిజైన్ చేసింది. ఇప్పటి వరకు మన బ్యాంకులు ‘నష్టం జరిగిన తర్వాత’ నిధులు కేటాయించేవి. కానీ ఇకపై, ‘నష్టం వస్తుందని ముందుగా అంచనా వేసి’ నిధులను సిద్ధం చేసుకోవాలి. ఇది వినడానికి బాగున్నా, బ్యాంకుల లాభాలు, లోన్ల మంజూరుపై దీని ప్రభావం ఉంటుంది.

ఈసీఎల్ మోడల్ అంటే ఏంటి..?

ఈ మార్పును మనం ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి లోన్ తీసుకొని, అది ‘మొండి బకాయి’ మారిన తర్వాతే బ్యాంక్ ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తన లాభాల నుంచి కొంత మొత్తాన్ని పక్కన పెడుతుంది. అంటే ‘ప్రమాదం జరిగిన తర్వాత హెచ్చరిక’ వంటిదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకురాబోతోన్న విధానంతో లోన్ ఇచ్చిన మొదటి రోజే, ఆ లోన్ భవిష్యత్తులో ఎగవేసే అవకాశం ఎంత ఉందో అంచనా వేసి.. ఆ రిస్క్ మేరకు కొంత శాతాన్ని నిధుల రూపంలో ముందే పక్కన పెట్టాలి. ఇది ‘ముందు జాగ్రత్త’ లాంటిది.

ఈసీఎల్ వల్ల కలిగే 5 ప్రధాన ప్రభావాలు

నష్టాలను ముందే అంచనా వేయడం వల్ల బ్యాంకులు తమ లాభాల నుంచి పెద్ద మొత్తం నిధుల కింద కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాంకుల ప్రాథమిక మూలధనం పడిపోయే అవకాశం ఉంది. మూలధనం తగ్గితే, బ్యాంకులు అప్పులు ఇచ్చే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా లోన్ల కోసం అప్లయ్ చేసే కస్టమర్ల విషయంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తాయి. రిస్క్ ఎక్కువగా ఉండే రంగాలు (ఉదాహరణకు అసంఘటిత రంగం, తక్కువ ఆదాయ వర్గాలు) లేదా గతంలో ఎక్కువ ఎగవేతలు జరిగిన రంగాల్లో పనిచేసే వారికి రుణాలు రావడం దాదాపు అసాధ్యంగా మరవచ్చు. అదనపు ప్రొవిజన్స్ కోసం అయ్యే ఖర్చును బ్యాంకులు తమ కస్టమర్ల నుంచే వసూలు చేయాలని చూస్తాయి. ఫలితంగా లోన్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు ఇప్పుడు డేటా సైన్స్, ఏఐ (AI)ని ఉపయోగించి ప్రతి లోన్ రిస్క్‌ను అత్యంత ఖచ్చితంగా లెక్కించాల్సి ఉంటుంది.

మనం భయపడాలా?

చాలా బ్యాంకుల వద్ద ప్రస్తుతం మూలధన నిల్వలు సరిపడా ఉన్నాయని, కాబట్టి ఈ మార్పు వల్ల వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే, తక్కువ మూలధనం ఉన్న చిన్న బ్యాంకులు, సహకార బ్యాంకులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఏప్రిల్, 2027 వరకు గడువు ఇవ్వడం వల్ల బ్యాంకులు ఈ కొత్త విధానానికి అలవాటు పడేందుకు తగిన సమయం లభిస్తుంది.

ఈసీఎల్ అమల్లోకి వస్తే మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇది భారత బ్యాంకింగ్ వ్యవస్థకు రక్షణ కవచంలా ఉంటుంది. ఆకస్మికంగా ఏదైనా పెద్ద కంపెనీ దివాలా తీసినా, బ్యాంకులు తట్టుకోగలవు. కస్టమర్లు కూడా తమ ‘క్రెడిట్ స్కోర్’ ‘క్రెడిట్ డిసిప్లిన్’ను కాపాడుకుంటేనే భవిష్యత్తులో రుణాలు పొందగలరనేది ఈ నిబంధనలు ఇచ్చే ప్రధాన సందేశం.

Tags:    

Similar News