జాతీయ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన!
జాతీయస్థాయి విపక్ష నేతలను టార్గెట్ చేయడం: పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీకి మాత్రమే పరిమితమైన జనసేన పార్టీ భవిష్యత్తులో జాతీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగు తుందా? ఆ తరహాలో రాజకీయాలను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ అధినేత పవన్ నిర్ణయించారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఢిల్లీ వేదికగా.. పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంలోని విషయాలను పరిశీలిస్తే.. వ్యూహం గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోందని విశ్లేషకు లు భావిస్తున్నారు.
1) జాతీయస్థాయి విపక్ష నేతలను టార్గెట్ చేయడం: పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీని మెడలు వంచుతామని ప్రకటించే నాయకులు.. ఇక్కడకు వచ్చాక మెడలు వంచుకుని వెళ్తారని వ్యాఖ్యానించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మమతా బెనర్జీ.. ఓటమిని అంగీకరించకపోగా.. ఢిల్లీలో సత్తా చూపిస్తామని.. ఢిల్లీమెడలు వంచుతామని అన్నారు. అలానే.. గతంలో కేసీఆర్ కూడా.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ఇలాంటి ప్రకటనలే చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఇలానే వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి వ్యాఖ్యలను గుర్తు చేయడం ద్వారా.. ఢిల్లీని మెడలు వంచుతామని ప్రకటనలు చేసే నాయకులకు పవన్ చురకలు అంటించారు. ఇదేసమయంలో ఎవరు ఎవరి మెడలు వంచక్కర్లేదని.. జాతీయ సమగ్రత కోసం.. కలసి సాగితే చాలన్న సందేశాన్ని ఇచ్చారు.
2) చిన్నపార్టీలని అనుకోవద్దని హెచ్చరించడం: ఇక, తన ప్రసంగంలో కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా.. జాతీయ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన అవతరించే అవకాశం ఉందన్న సందే శాన్ని పవన్ కల్యాణ్ ఇచ్చినట్టు అవుతుంది. చిన్నపార్టీలే కదా.. అని అనుకోవద్దన్న హెచ్చరిక స్పష్టంగా కనిపించింది. కాక్రోచ్‌క కూడా ఇలానే ప్రారంభమైందని.. కానీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిందని పేర్కొన్నారు. తద్వారా.. తమది కూడా.. చిన్నపార్టీనే అయినా.. దేశంలో విస్తరించేందుకు ఎలాంటి సంకోచాలు లేవన్న సంకేతాలు పంపినట్టు అయింది.
3) తటస్థులకు వేదికగా మారడం: ఇక, తటస్థులకు వేదికగా కూడా.. జనసేనను మలిచే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ సమగ్రత నినాదం వెనుక.. తటస్థులను.. దేశ భక్తి, దేశం కోసం ఏదైనా చేయాలని భావించే వారిని తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం వెనుక.. తటస్థులనే కీలక ఆయుధంగా మార్చుకున్నారు. ఇప్పుడు అదే మంత్రాన్ని పవన్ కూడా పఠించనున్నారన్నది సుస్పష్టంగా తెలుస్తోంది.