గగనతల రక్షణకు భారత్ కు మరో ఆయుధం.. వచ్చే నెలలో పంపించనున్న రష్యా.. శత్రువులకు వణుకు!
భారత్-రష్యా మైత్రి అంటే ఎలాంటిదో చెప్పడం కష్టం.. ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వని విలువను రష్యా భారత్ కు ఇస్తుంది.;
భారత్-రష్యా మైత్రి అంటే ఎలాంటిదో చెప్పడం కష్టం.. ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వని విలువను రష్యా భారత్ కు ఇస్తుంది. ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి అంత బలంగా ఉంటుంది. ఒక వైపు ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్నా.. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు ఉన్నప్పటికీ, రష్యా అత్యంత శక్తివంతమైన S-400 ట్రయంఫ్ క్షిపణిని భారత్ కు అందించడం రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు నిదర్శనం. వచ్చే నెలలో భారత్ కు చేరుకోబోయే నాలుగో యూనిట్ భారత రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేయబోతోంది.
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) తన అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన ఆయుధాన్ని చేర్చుకోబోతోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదు S-400 యూనిట్లలో నాలుగోది వచ్చే నెలలో భారత్‌కు చేరనుంది. సుమారు ₹35,000 కోట్లకు పైగా విలువైన ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే మూడు యూనిట్లను రష్యా భారత్ కు ఇచ్చింది. వీటిని చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో వ్యూహాత్మకంగా మోహరించారు. ఇప్పుడు రాబోయే నాలుగో యూనిట్‌ను రాజస్థాన్ సెక్టార్‌లో మోహరించడం ద్వారా పశ్చిమ సరిహద్దులో నిఘాను వంద శాతం పటిష్టం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
S-400 ఎందుకింత స్పెషల్..
ప్రపంచంలోనే అత్యుత్తమ గగనతల రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టం)గా దీనికి గుర్తింపు ఉంది. అమెరికాకు చెందిన 'పాట్రియాట్' వ్యవస్థ కంటే ఇది ఎంతో మెరుగైనదని రక్షణ నిపుణులు చెబుతుంటారు. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను సెకన్ల వ్యవధిలో గుర్తించి కూల్చివేయగలదు. ఒకేసారి దాదాపు 100 లక్ష్యాలను ట్రాక్ చేయడమే కాకుండా, అందులో అత్యంత ప్రమాదకరమైన 36 లక్ష్యాలపై ఏకకాలంలో దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో షార్ట్, మిడ్, లాంగ్ రేంజ్ క్షిపణులు ఉంటాయి. దీనివల్ల శత్రువు ఏ ఎత్తులో వచ్చినా వీటి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
వ్యూహాత్మక మోహరింపు..
రష్యా వచ్చే నెల అందజేసే నాలుగో యూనిట్‌ను రాజస్థాన్‌లో మోహరించాలని ఆర్మీ వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ సరిహద్దు నుంచి పాకిస్థాన్ లోపలి భూభాగాలను, ముఖ్యంగా వారి ఎయిర్ బేస్‌లను మనం నిరంతరం పర్యవేక్షించవచ్చు. శత్రు విమానం వారి గడ్డపై టేకాఫ్ అయిన నిమిషంలోనే మన రాడార్లకు చిక్కిపోతుంది. ఇటీవల సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాల రవాణా పెరుగుతోంది. S-400 లోని అత్యాధునిక రాడార్లు చిన్నపాటి డ్రోన్లను గుర్తించి నాశనం చేయగలవు.
అమెరికా ఆంక్షలను కాదని భారత్ సాహసం
రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ‘కాట్సా’ (CAATSA) చట్టం విధిస్తుంది. అయినప్పటికీ భారత్ తన జాతీయ భద్రత దృష్ట్యా అమెరికా ఒత్తిళ్లను తట్టుకొని ఈ ఒప్పందాన్ని చేసుకుంది. ఇది భారత స్వతంత్ర విదేశీ విధానానికి నిదర్శనం. వచ్చే నవంబర్‌లో ఐదో యూనిట్ కూడా వస్తే, లడఖ్ నుంచి కన్యాకుమారి వరకు భారత గగనతలం అజేయమైన కోటలా మారుతుంది.
S-400ను మనం దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, ఇదే తరహాలో భారత్ సొంతంగా 'కుషా' (ప్రాజెక్టు కుషా) పేరుతో సుదూర పరిధి క్షిపణి రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఇలాంటి వ్యవస్థల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం భారత్ కు ఉండదు. S-400 రాకతో మన సైనికుల మనోధైర్యం పెరగడమే కాకుండా, ప్రత్యర్థులు మన సరిహద్దుల వైపు చూడాలంటేనే భయపడతారు.